అంటువ్యాధులపై అవగాహన కల్పించండి
ప్రజాశక్తి- యాదమరి : అంటువ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రానున్న రెండునెలల్లో ప్రాణాంతకమైన జ్వరాలతో పాటు అంటువ్యాధులు కూడా ప్రభలే అవకాశం ఎక్కువగా ఉందని యాదమరి సిహెచ్‌ఓ లక్ష్మీనారాయణ సిబ్బందికి సూచించారు. బుధవారం యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షేత్రస్థాయి సిబ్బంది నెలవారి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిహెచ్‌ఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను మనం తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. అలాగే మాత శిశు సంరక్షణకై వారికి అందించాల్సిన వ్యాధినిరోధక టీకాలను సకాలంలో వేయాలన్నారు. గర్భవతుల నమోదు త్వరితగతిన కావాలని అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పు అయ్యేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరోజు కేటాయించిన సమయంలో మీమీ పరిధిలోని గ్రామాలలో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా విధినిర్వహణలో తప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో సూపర్వైజర్లు అనసూయమ్మ, లక్ష్మీపతి, ఎంఎల్‌హెచ్‌పిలు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.










