Oct 30,2022 21:34

2003 నుండి వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్‌ ఎంపిహెచ్‌ఎల నియామకం
నోటిఫికేషన్‌ ఇచ్చింది 205 మందికే
ఇప్పటి వరకు 417 మంది నియామకం
నియామక దస్త్రం అప్పట్లోనే మాయం
కోర్టుకి వెళ్లి ఆర్డర్‌ తెచ్చుకుంటే ఉద్యోగం
ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌

            ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైద్యఆరోగ్యశాఖ రెండు దశాబ్దాలుగా అవినీతి, దొడ్డిదార్లలో నియామకాల విషయంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. కీలకమైన మేల్‌ హెల్త్‌ అసిస్టెంట్ల నియామకం ఆది నుంచి వివాదాస్పదమేనని చెప్పాలి. 2003లో డిఎస్‌సి ద్వారా ఒప్పంద పద్దతిలో నియామకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినప్పటికీ ఇంటర్‌, పదో తరగతి అర్హతపై ప్రాథమిక దశలోనే నియామక ప్రక్రియ కోర్టు మెట్లెక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టు జోక్యంతో నియామకాలు సాగుతూనే ఉన్నాయి. గత 20 ఏళ్లుగా కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే కోర్టు నుంచి ఆర్డర్‌ తెచ్చుకున్న వారందరినీ నియమించేస్తున్నారు అధికారులు. ఇదే అదునుగా కొందరు అధికారులు, ఆర్డర్‌ తెచ్చుకో.. ఉద్యోగం పట్టు చందంగా సలహాలు ఇస్తూ కాసులతో జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 20 ఏళ్లుగా సాగుతున్న ప్రక్రియలో 19 ఏళ్లుగా మొదటి నుంచి ఉద్యోగాలు చేస్తున్న హెల్త్‌ అసిస్టెంట్లు కొత్తగా వస్తున్న వారితో పోటీ పడలేక రెగ్యులర్‌ చేస్తారనే ఆశతో ముందుకు సాగుతున్నారు.
2002 నుంచి...
వైద్యఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో 2003 నుండి డిఎస్‌సి ద్వారా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ కాంట్రాక్ట్‌ విధానంలో 2002లో హెల్త్‌ అసిస్టెంట్‌ మేల్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. 205 ఖాళీలతో 459 జిఒను అప్పట్లో విడుదల చేశారు. అందులో హెల్త్‌ అసిస్టెంట్‌ మేల్‌కు పదో తరగతి అర్హత, ఎంపిహెచ్‌ఎ డిప్లమో ఉంటే చాలని ప్రకటించటంతో పదో తరగతి అనంతరం డిప్లమో చేసిన వారందరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. 2002 ఆగస్టు 9న రాత పరీక్ష నిర్వహించి మెరిట్‌ లిస్టు ప్రకటించారు. మే నెలలో గవర్నమెంట్‌ ఇనిస్టిట్యూషన్‌లో శిక్షణ పూర్తి చేసిన వారిని రాత పరీక్ష అనంతరం సుమారు 205 ఖాళీ పోస్టుల్లో ముందుగా నియమించారు. (ప్రభుత్వ శిక్షణ పొందిన అభ్యర్థులకు మూడు సంవత్సరాల్లోపు ఉద్యోగ భద్రత ఇవ్వాలి అనే నిబంధన మేరకు నియామకాలు చేపట్టారు. అనంతరం 2003 జూన్‌ ఐదో తేదీన ఇంటర్మీడియట్‌, ఎంపిహెచ్‌ఎ అర్హతగా నిర్ణయించి, రాత పరీక్షలో వచ్చిన మార్కులు, రోస్టర్‌ ఆర్‌.ఓ.ఆర్‌ విధానం లో మిగిలిన ఖాళీల భర్తీని చేపట్టారు. జూన్‌ 5వ తేదీన హాజరు కాని ఏడుగురు అభ్యర్థులకు తర్వాత ఉద్యోగ అవకాశం కల్పించారు. డిసెంబర్‌ 9న 2003లో సుమారు 10 మంది అభ్యర్థులచే ఖాళీలను భర్తీ చేశారు. ఇలా 212 ఖాళీలను అప్పట్లో భర్తీ చేశారు. పదో తరగతి అర్హత పొందిన అభ్యర్థులు దిగువ స్థాయిలో ఉండటాన్ని బట్టి ఆందోళన చెందిన వారు హైకోర్టుకు వెళ్లారు. వైద్యారోగ్య శాఖ తాము చేసిన తప్పును తెలుసుకొని ఇంటర్మీడియట్‌, డిప్లమో అర్హత కలిగిన వారితో 205 పోస్టులను భర్తీ చేశారు. అయితే పదో తరగతి అభ్యర్థులు నోటిఫికేషన్‌పై హైకోర్టులో కేసు వేశారు. నోటిఫికేషన్‌లో తప్పుడు అర్హత ఇచ్చామని నాలిక కరుచుకున్న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఉపసంఘాన్ని నియమించి కార్తర్‌ సింగ్‌ కమిటీ 1972 నివేదిక ప్రకారం నిర్దేశించిన మార్గాలను అనుసరించి, సివిల్‌ కోడ్‌ వాల్యూమ్‌ నాలుగులో ఆర్టికల్‌లో ఉదహరించిన సూచనల మేరకు ఇంటర్‌ అర్హత కలిగిన అభ్యర్థులను అప్పటికీ మిగిలి ఉన్న ఖాళీలను భర్తీ (212) చేసింది. 2006లో హైకోర్టు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను పదో తరగతి అభ్యర్థుల మెరిట్‌ జాబితాను తయారుచేసి ఉద్యోగాలు ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీనిపై అప్పటి ప్రభుత్వం ఖాళీగా ఉన్న సుమారు 65 ఖాళీలను మెరిట్‌ బేస్‌గా ఇచ్చారు. తిరిగి 2009లో అంగవైకల్యం ఉన్న పోస్టులను శాశ్వత ప్రాతిపదికపై ఇంటర్‌ అర్హత కలిగిన ఏడుగురు అభ్యర్థులను ప్రభుత్వం హెల్త్‌ అసిస్టెంట్లుగా నియమించింది. దీనిపై అప్పుడు పని చేస్తున్న 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరూ ప్రతిఘటించలేదు. తదుపరి వైద్య శాఖలో పని చేస్తున్న ఆఫీస్‌ సబార్డినేట్లు ఇంటర్‌ అర్హత కలిగి ఉంటే ఆరు నెలలు ఇన్‌ సర్వీస్‌ ట్రైనింగ్‌ ఇచ్చి వారిని హెల్త్‌ అసిస్టెంట్లుగా నియమించింది. దీనిపై కూడా సదరు పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరూ ప్రతిఘటించలేదు. ఏ కోర్టులకూ వెళ్లలేదు. అంటే దీని అర్థం శాశ్వత ప్రాతిపదికపై నియమించే హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులకు కచ్ఛితంగా ఇంటర్మీడియట్‌ అర్హత కలిగి ఉండాలి అనేది ప్రభుత్వ వాదన. 2012లో సుప్రీంకోర్టు తీర్పు 273 జిఒ ఆధారంగా నోటిఫికేషన్‌లో ప్రభుత్వం ప్రకటించిన అర్హత మెరిట్‌ బేస్డ్‌గా తిరిగి భర్తీ చేయాలని ఆదేశించడంతో అప్పటి వరకు ఉద్యోగంలో ఉన్న ఉమ్మడి రాష్ట్ర అభ్యర్థులను తొలగించి తిరిగి ఉద్యోగాలు ఇచ్చారు. కేవలం అప్పటికి జిల్లాలో సుమారు 285 మంది అభ్యర్థులు పని చేస్తున్నారు. అయితే 2005లో 285 మంది అభ్యర్థులను తొలగించి నోటిఫికేషన్‌లో నిర్దేశించిన 212 అభ్యర్థులకు మాత్రమే ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ వేసి ఉద్యోగావకాశాలు కల్పించింది. ఇక్కడ వైద్యారోగ్య శాఖ తప్పు చేసింది. ఎందుకంటే నోటిఫికేషన్‌ మీద సుప్రీంకోర్టులో తీర్పు పెండింగ్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఏ విధమైన ఉద్యోగాలూ ఇవ్వకూడదు. అయితే 2012 వరకు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వచ్చారు. వాస్తవానికి వైద్యారోగ్య శాఖ ఆ సమయానికి అనగా 2012కు పని చేస్తున్న సుమారు 285 మందిఅభ్యర్థులకు మెరిట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వేసి 273 జిఒను అమలు చేయాలి. అయితే అధికారులు కేవలం 212 ఖాళీ పోస్టులు చూపించి ఆ 212లో కొన్ని నాన్‌ జాయినింగ్‌, డెత్‌లు ఉంటే ఆ ఖాళీ పోస్టుల స్థానంలో ఆయా కేటగిరీలకు సంబంధించిన అర్హులైన అభ్యర్థులచే నియమించకుండా ఉండటం, అర్హులైన అభ్యర్థులను విధులు నుండి తొలగించడం వల్ల కొంతమంది 15 నెలలపాటు అధికారుల అలసత్వానికి బలయ్యారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. నష్టపోయిన అభ్యర్థులు సుమారు 556 రోజులు రిలే నిరాహార దీక్షలు చేసి తిరిగి వారు 1207 జిఒతో ఉద్యోగాలు పొందారు. దీన్ని ఆధారంగా చేసుకుని మిగిలిన అభ్యర్థులందరూ హైకోర్టును ఆశ్రయించి 1207 జిఒకు, 273 జిఒకు మధ్యలో తామూ మెరిట్‌ కలిగి ఉన్నామని కోర్టును ఆశ్రయించగా కోర్టు ఉత్తర్వుల మేర 1207 జిఒలో వచ్చిన అభ్యర్థులను ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ ప్రకారం వేసి అందులో కొంతమందిని తొలగించారు. మళ్లీ వారు కోర్టును ఆశ్రయించి కోర్టు ఆదేశాలతో మళ్లీ ఉద్యోగాల్లో చేరారు. దీనిలో కొంతమంది అభ్యర్థులు వారు పని చేస్తున్న ప్రదేశం కాక కొత్త ప్రదేశం కోసం రాజకీయ నేతలతో అప్పటి కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. కోర్టు ఆర్డర్‌ ప్రకారం వచ్చిన వారందరినీ, వారు పని చేస్తున్న ప్రాంతానికి దూరంగా ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్డర్‌ పాస్‌ చేస్తే దానిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అమలు చేసింది. ఆనాటి నుండి నేటి వరకు ఎప్పటికైనా బదిలీలు అవుతాయనే ఆశతో కొందరు ఎదురు చూస్తున్నారు. తొలగించబడి మళ్లీ విధుల్లో చేరిన అభ్యర్థుల కంటే తమకు ఎక్కువ మార్కులున్నాయని మరికొందరు కోర్టును ఆశ్రయించగా కోర్టు ఉత్తర్వులు మేర నేటికీ ఉద్యోగాలు పొందుతూనే ఉన్నారు. అంటే దీని అర్థం నోటిఫికేషన్‌ కాంట్రాక్టు సర్వీస్‌ అని ఇవ్వడం వల్ల రాత పరీక్షకు కాలపరిమితి లేదు అనేది కోర్టు అభిప్రాయమా అనేది అర్థ కాని ప్రశ్నగా ఉంది. ఎపిపిఎస్‌సి, యుపిఎస్‌సి రాత పరీక్ష అనంతరం సంబంధిత అభ్యర్థులు ఉద్యోగాలు ఎంత కాలంలో భర్తీ చేయాలి, ఒకవేళ అభ్యర్థి ఉద్యోగం వచ్చి విధుల్లో చేరకపోతే ఎంతకాలంలో అతడు, ఆమె తన అర్హతను కోల్పోతారు అనే నిబంధనలు ఉంటాయి. అయితే ఇక్కడ ఈ రాత పరీక్షకు నిబంధనలు లేవు. 20 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ అభ్యర్థులు ఉద్యోగాలు పొందుతూనే వస్తున్నారు. ఇది వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల అసమర్ధతా.. అవగాహనా లోపమా ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోతోంది. ఇక్కడ అభ్యర్థులు కేవలం కాంట్రాక్టు సర్వీసులో ఇచ్చిన నోటిఫికేషన్‌ బూచిగా చూపించి రెగ్యులర్‌గాని, బదిలీలుగాని, రీడిప్లయ్మేంట్‌గాని కేవలం పదో తరగతినే (273) ప్రామాణికమని కోర్టులకు తిరగటం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇరకాటంలో పెట్టడం షరా మామూలేగా మారింది.
కొత్త ఆందోళన
ఈ మధ్య 20 సంవత్సరాల నుంచి ఒకే ప్రదేశంలో ఉద్యోగాలు చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు స్థానచలనం అవకాశాలు కల్పించాలని కొన్ని యూనియన్ల వారు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. దీనికి ప్రభుత్వం సరే అని బదిలీలకు అవకాశం ఇచ్చినా మళ్లీ అదే తంతు. 273 మెరిట్‌ బేస్డ్‌ వారికి ముందు బదిలీలు ఇచ్చి మిగిలిన వారికి తర్వాతే ఇవ్వాలని మరికొందరు కోర్టును ఆశ్రయించి కోర్టు ఉత్తర్వులతో అధికారులను ఆశ్రయిస్తున్నారు. బదిలీలు అనేవి సర్వీస్‌ను ఆధారంగా చేసుకుని జరపాలిగాని, మెరిట్‌ను ఆధారంగా చేసుకుని జరుపకూడదని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. 2003 నుండి తాము సర్వీస్‌ కలిగి ఉన్నామని, ఈ విధంగా జాబితాలు తయారు చేస్తే తాము సర్వీసును కోల్పోతున్నామని సదరు సిబ్బంది అధికారులను ఆశ్రయిస్తున్నట్టు సమాచారం.