Aug 06,2023 23:22

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, గంజాయి తదితర మత్తుపదార్ధాల సరఫరా, విక్రయం, వినియోగం నితృకృత్యంగా మారాయి. బహిరంగ ప్రదేశాల్లో జనసమ్మర్ధం లేని ప్రాంతాల్లో మద్యం సేవించడం పరిపాటైంది. ఇది నేరాలకు దారితీయడంతోపాటు మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, పిల్లలపై దాడులకు కారణమవుతోంది. వేర్వేరు కారణాలతో మహిళలు, యువతులు, బాలికల అదృశ్యం తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అదృశ్యమైన కేసుల్లో 95 శాతం మంది ఆచూకిని తెలుసుకుని వారిని తిరిగి వారితల్లిదండ్రులకు అప్పగిస్తున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు.
2019లో జిల్లాలో బాలికలు, యువతులు 93 మంది అదృశ్యం కాగా 90 మందిని గుర్తించారు. 2020లో 77 మందికి గాను 75 మందిని, 2021లో 134కి గాను 130 మందిని, 2022లో 147 మందికి గాను 144 మందిని గుర్తించి తల్లిదండ్రులకు, సంరక్షకులకు అప్పగించారు. 2023లో ఇప్పటి వరకు 80 మంది అదృశ్యం కాగా దాదాపు 74 మందిని గుర్తించారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు ఎక్కువగానే నమోదవుతున్నా పోలీసు స్టేషన్‌లలో కేసుల నమోదు రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరుగుతుందనే విమర్శ లేకపోలేదు. ఏదైనా కీలక కేసు నమోదు కావాలంటే కొంతమంది పోలీసు అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధి అనుమతి అనివార్యంగా చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కేసు నమోదు కాకుండా రాజీలు కూడా చేపడుతున్నారు. రాజీకి అంగీకరించని పక్షంలో ప్రతిపక్షాలు, మీడియా జోక్యంతో చివరికి కేసులు నమోదయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.
మహిళలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగదని భావించిన వారు నేరుగా ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా స్పందన ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు 675, డయల్‌ 100 లేక 112 ద్వారా వచ్చినవి 512, పోలీసు సేవా యాప్‌ ద్వారా 17, సైబర్‌ మిత్ర తో 43 ఫిర్యాదులు అందాయి. గంజాయి ప్రభావంతో నేరాలు జరగడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నా మత్తులోనే చాలా ఘటనలు జరుగుతున్నాయి. తాడేపల్లిలో అంధురాలిపై దాడి చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడ్ని పట్టుకున్నా అతని మత్తులోనే నేరానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. గుంటూరులో నిశిరాత్రి వేళ ఇద్దరు మైనర్లు మత్తులోనే వాణిజ్య సముదాయాలపైదాడి చేసి ఇద్దరు వాచ్‌మెన్లను హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. మత్తులో ఎవరిపైనా దాడులు, అఘాయిత్యాలకు పాల్పడే తత్వం పెరుగుతోంది. గతేడాది పెదకాకాని మండలం తక్కెళ్లపాడు జరిగిన వైద్య విద్యార్థినీ తపస్వీ హత్య కేసు జిల్లాలో కలకలం రేపింది. గంజాయికి సంబంధించి 2020లో 51 కేసుల్లో 169 మందిని అరెస్టు చేసి 728.50 కిలోలు సీజ్‌ చేయగా 2021లో 70 కేసులు నమోదు చేసి 182 మందిని అరెస్టు చేసి 3613.66 కిలోల గంజాయి సీజ్‌ చేసినట్టు తెలిపారు. 2022లో 68 కేసులు నమోదు అయ్యాయి. 154 మందిని అరెస్టుచేశారు. 260 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు జిల్లాలో 293 గంజాయి కేసులలో 670 మందిని అరెస్ట్‌ చేసి 4158 కిలోల గంజాయిని, 9.084 లీటర్ల గ్రాముల ద్రవరూప గంజాయిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నా సాగుదార్లను గుర్తించి మూలలను నిరోధించడంలో యంత్రాంగం విఫలం కావడం వల్ల సరఫరా, విక్రయాలు, వినియోగం యథాతథంగా కొనసాగాయి.