
* వారం రోజులుగా సంచారం
* దాడిలో ఆవులు, గేదె, పెయ్యి మృతి
ప్రజాశక్తి- కవిటి, కంచిలి: వారం రోజులుగా కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాల్లో ప్రశాంతంగా సంచరించిన పెద్దపులి బుధవారం ఒక్కసారిగా పంజా విసిరిసింది. కవిటి మండలం సహలాలపుట్టుగ పంచాయతీ లండారిపుట్టుగకు చెందిన మామిడి కొయిరయ్య అనే రైతు ఆవు దూడ, కొండిపుట్టుగకు చెందిన నర్తు పాపయ్య గేదె పెయ్యి పులిదాడిలో చనిపోగా, కొండిపుట్టుగకు చెందిన కొర్రాయి నూకయ్య గేదె, పెయ్యి, మురిపాల ఢిల్లీరావు ఆవు దూడ తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో ఉద్దానం వాసులు ఉలిక్కి పడ్డారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో విశాఖ నుంచి వస్తున్న కెవిఆర్ బస్సుకు మండలంలోని నెలవంక సమీపంలో పులి ఎదురు పడడంతో అతను స్థానికులకు ఫోన్ చేసి అప్రమత్తం చేశాడు. తెల్లవారు జామున లేచి చూసేసరికి మండలంలోని గుజ్జుపుట్టుగ, కొండిపుట్టుగ, లండారిపుట్టుగ గ్రామాల్లో పశువులపై దాడి చేయడం అందులో రెండు చనిపోయాయి.
కంచిలి మండలం మండలంలోని మండపల్లికు చెందిన మాదిన శ్రీనివాసరావు అనే రైతుకు చెందిన ఆవు మంగళవారం అర్ధరాత్రి పులి దాడికి గురై మృతి చెందింది. శ్రీనివాసరావు ఇంటి సమీపంలో ఎప్పటిలాగే ఆవులను కట్టి ఉంచారు. బుధవారం ఉదయం నాలుగు గంటలకు వెళ్లి చూసేసరికి ఒక ఆవు కనిపించకుండ పోయేసరికి పరిసరాల్లో వెతికి చూస్తే... తీవ్ర గాయాలతో ఆవు మృతి చెందినట్లు గుర్తించారు. ఈ సమాచం తెలుసుకున్న ఆర్‌డిఒ భరత్ నాయక్, ఫారెస్టు రేంజ్ అధికారి మురళీకృష్ణ నాయుడు, తహశీల్దార్ హైమావతి, అటవీ శాఖ సిబ్బంది సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలన చేశారు. అనంతరం పశువైద్యాధికారి శిరీష పోస్టుమార్టం నిర్వహించారు. అలాగే సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బెండాళం అశోక్, ఎంపిపిలు దేవదాస్‌రెడ్డి, డాక్టర్ దాసు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. పరిశీలనలో డిఆర్‌ఒఐ రాము, బారువ సెక్షన్ ఆఫీసర్ రాజేంద్ర పాల్గొన్నారు.
అటవీ శాఖ తీరుపై అసంతృప్తి
ఇటువంటి పరిస్థితుల్లో అటవీ శాఖ సిబ్బంది పాత్ర కేవలం అడుగులు అంచనా వేయడానికే పరిమితవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రోజూ ఏదో ఓ గ్రామంలో స్థానికులు పులి అడుగులు చూసి అటవీ సిబ్బందికి చెప్పడం, సిబ్బంది వచ్చి పౌడర్ చల్లి ఇది అదే అని చెపుతున్నారు. కానీ, అంతకుమించి పురోగతి కనిపించడం లేదు. వారం రోజులుగా మూడు మండలాల్లో పులి సంచరి స్తున్నా ఎక్కడా కెమెరా ట్రాప్‌లు కానీ, పులి బోనులు కానీ ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు పూర్తిస్థాయిలో దానిపై నిఘా వేసి కెమెరా ట్రాప్ లు, పులి బోనులు ఏర్పా టు చేయాలని, వ్యవసా య రంగానికి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాంతం లో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పులి బారినుంచి ప్రజలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.