ప్రజాశక్తి - సాలూరు
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, సాలూరు నియోజకవర్గ ఇన్చార్జి గుమ్మిడి సంధ్యారాణి అంతరంగం అంతుచిక్కడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె వ్యవహారశైలిని ఆమె సొంత అనుచరులే అంచనా వేయలేకపోతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే ఏ పార్టీ నాయకుడు లేదా నాయకురాలైనా నాలుగు ఓట్లు ఉన్న స్థానిక నాయకులతో సఖ్యత కోరుకుంటారు. రాజకీయంగా శత్రువైనా గెలుపు కోసం వారి సహకారం కావాలని అభ్యర్ధిస్తారు. కానీ ఇక్కడ నియోజకవర్గ ఇన్చార్జి సంధ్యారాణి వ్యవహారశైలి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. సొంత పార్టీకి చెందిన అంగబలం, అర్ధబలం ఉన్న నాయకులను కలుపుకుని పోవడానికి ఆమె ఇష్టపడడం లేదు. సాలూరు పట్టణం, మక్కువ, పాచిపెంట మండలాలకు చెందిన సీనియర్ నాయకులతో సర్దుబాటుకు ఆమె అంగీకరించడం లేదు. కొద్దిరోజుల క్రితం టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి సంధ్యారాణి వ్యవహారశైలిని ఆయన పూర్తిగా తప్పుబట్టారు. మక్కువ మండలానికి చెందిన సీనియర్ నాయకులు పెంట తిరుపతిరావు, పాచిపెంట మండల పార్టీ అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌బాబును కలుపుకునిపోవాలని చంద్రబాబు నాయుడు ఆమెకు సూచించారు. భంజ్‌దేవ్ సలహా సూచనల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆమె శుక్రవారం భంజ్‌దేవ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇద్దరి మధ్య వాదోపవాదాలు తారాస్థాయికి వెళ్ళినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల్లో నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి సమావేశానికి సంబంధించిన అంశంపై ఆమె భంజ్‌దేవ్‌తో చర్చించారు. సీనియర్ నాయకులు పెంట తిరుపతిరావును తాను పిలవబోనని, మీరే పిలవాలని భంజ్‌దేవ్‌తో ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా పెంట తిరుపతిరావును కలుపుకొని పోవాల్సిన బాధ్యత మీదేనని భంజ్‌దేవ్ సంధ్యారాణికి సూచించారు. అయినా ఆమె తిరుపతిరావును తాను పిలిచేది లేదనే ఖరాఖండిగా భంజ్‌దేవ్‌కి చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించినా సీనియర్ నాయకులతో కలిసి పనిచేయడానికి సంధ్యారాణి సుముఖత వ్యక్తం చేయకపోడం పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదిలా వుండగా తనను కలుపుకుని వెళ్లేందుకు ఇష్టపడని సంధ్యారాణి తీరుపై సీనియర్ నాయకులు పెంట తిరుపతి రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను సమావేశానికి పిలవడానికి ఇష్టం లేని సంధ్యారాణికి వ్యతిరేకంగా మరో గిరిజన అభ్యర్థిని రంగంలోకి దించుతానని ఆయన వాట్సాప్‌లో బహిరంగ లేఖ విడుదల చేశారు. రానున్న ఎన్నికల్లో తన సత్తా ఏమిటో చూపిస్తానని ఆయన ప్రకటించారు. త్వరలో కొత్త అభ్యర్థితో ప్రచారం మొదలు పెడతానని స్పష్టం చేయడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలను విస్మయానికి గురిచేస్తోంది. సీనియర్లను కలుపుకుని పోవడంలో సంధ్యారాణి అనుసరిస్తున్న వైఖరిని టిడిపికి కొంతమంది తటస్ట నాయకులు, కార్యకర్తలు తప్పుపడుతున్నారు. రాజకీయాల్లో పట్టువిడుపులు వుండాలని, నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా సంధ్యారాణి వ్యవహారశైలి ఉండడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. తాజా పరిణామాలు పార్టీని ఎటు తీసుకెళ్తాయోనని సామాన్య కార్యకర్త లు ఆందోళన చెందుతున్నారు.










