మారుతోన్న జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి ముఖచిత్రం
రిఫరీల వైపే మొగ్గు
కొత్త సూపరింటెండెంట్ వైఖరిపై సిబ్బంది గుర్రు
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ఏలూరులోని జిల్లాకేంద్ర ప్రభుత్వాసుపత్రి ముఖచిత్రం క్రమేపి మారుతోంది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ వైద్య, విధాన పరిషత్ పరిధిలో ఉన్న ఈ ఆసుపత్రిని కొద్దిరోజుల క్రితమే వైద్య, విద్య కళాశాల (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) పరిధిలోకి రావడంతో దానికి తగినట్లుగానే అధికారులు మార్పులు చేపట్టారు. ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్లు ఉండే విభాగాల్లో ఆధునికీకరణ పనులు చేపట్టారు. కొన్ని ఇన్‌పేషెంట్ల విభాగాలను మాత్రమే ఉంచి మిగిలిన వాటిలో ఆధునికీకరణ పనులను చేస్తున్నారు. రోజువారీ వచ్చేరోగులకు అవుట్ పేషెంట్ల విభాగాలను అందుబాటులోనే ఉంచారు. అయితే ఈ విషయంపై రోగుల్లో గందరగోళం నెలకొంది. గతంలో ఇక్కడకు వచ్చే రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైతే వారిని ఆసుపత్రిలో చేర్పించేవారు. కానీ ప్రస్తుతం వైద్యులు ఆ పనులను చేయడం లేదు. ఎక్స్‌రే విభాగంలో ఫిల్మ్ ఇచ్చే విధానం తీసివేశారు. కనీసం రోగి గానీ, రోగి సహాయకులు గానీ ఫొటో తీసుకునే వెసులుబాటు కూడా కల్పించడం లేదు. ఆ ఎక్స్‌రే ఫొటోను వైద్యుల వాట్సాప్ గ్రూపులో పెడుతున్నారు. సోమవారం ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి ఎక్స్‌రే విషయంలో చేదు అనుభవం ఎదురైంది. 11వ నంబరు వార్డులో ఉన్న వైద్యురాలు ఎక్స్‌రే తీయించుకురావాలని సూచించడంతో ఆ రోగి ఎక్స్‌రే తీయించుకున్నాడు. దానికి సంబంధించిన ఫిల్మ్ ఇవ్వకుండా కేవలం రిపోర్టు కాగితాలను మాత్రమే అతనికిచ్చి పంపించారు. తీరా వాటిని పట్టుకుని ఆ వైద్యురాలి వద్దకు వెళ్తే ఇందులో ఏమీ లేదని రిపోర్టు వచ్చిందని, ఎక్స్‌రే ఫిల్మ్ ఉంటే తీసుకువస్తే దాన్ని పరిశీలించి చెబుతానన్నారు. తీరా అక్కడికి వెళ్తే గ్రూపులో పెట్టామని బదులిచ్చారు. తిరిగి వైద్యురాలి వద్దకు వస్తే తాను జూనియర్ డాక్టర్‌నని, తాను ఆ గ్రూపులో ఉండనని, పెద్ద డాక్టరు వద్దకు వెళ్లాలని సూచించారు. దీంతో అతను ఎవరి వద్దకు వెళ్లాలో? ఎక్కడికి వెళ్లాలో? తెలీక చివరకు ఓ ప్రయివేటు ఆసుపత్రిని ఆశ్రయించాడు. ఇదే విధంగా రోగులు ఆస్పత్రిలో ఏం జరుగుతుందో? ఎవరి వద్దకు వెళ్లాలో తెలీక ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
అయితే గుంటూరు.. లేకుంటే విజయవాడ..!
ఆస్పత్రికి వచ్చే కేసుల్లో అధికశాతం విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. కొంచెం సీరియస్‌గా ఉన్న కేసు వస్తే చాలు వెంటనే రిఫర్ చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. దీంతో చాలామంది రోగులు అంతదూరం వెళ్లలేక ఇక్కడే ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. నిరుపేదలు మాత్రం విజయవాడ, గుంటూరు వెళ్తున్నారు. దీంతోపాటుగా కొత్త సూపరింటెండెంట్ వ్యవహారశైలిపై పలువురు సిబ్బంది గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఆయనతో సిబ్బందితో దురుసుగా వ్యవహరిస్తున్నారని, అతి కొద్దికాలంలోనే రిటైర్డ్ కాబోతున్నానని, తనకు ఏవరితో సత్సంబంధాలు అవసరం లేదనే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఇటీవల ఆయన తీరు బాగోలేదంటూ పలువురు సిబ్బంది ఆందోళన కూడా చేపట్టారు.










