Jan 24,2023 21:41

రాజకీయ వైఖరిపై స్పష్టత లేని బిజెపి నేతల ప్రసంగాలు
టిడిపి, వైసిపిలను ఓడించాలని పిలుపు
మాదిగలకు ఏం చేశారని ప్రశ్నించిన ఎంఆర్‌పిఎస్‌ నేతలు
భీమవరంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ప్రజాశక్తి - భీమవరం

'వచ్చే సంవత్సరంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో జరగనున్న రాష్ట్రస్థాయి సమావేశాల్లో కచ్ఛితంగా ఆ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ వైఖరిపై చర్చించి నేతలు దిశానిర్దేశం చేస్తారు అని ఆశించిన బిజెపి శ్రేణులను మరింత గందరగోళంలోకి నెట్టింది ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. స్థానిక ఆనంద ఫంక్షన్‌ హాలులో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం జరిగింది. సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షత వహించగా కేంద్ర మంత్రులు మురళీధర్‌, పవర్‌, బిజెపి జాతీయ కార్యదర్శి సునీల్‌ ధియోధర్‌, రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌, జివిఎల్‌.నరసింహారావు, ఎంఎల్‌సిలు పివిఎన్‌.మాధవ్‌, నారాయణరెడ్డి, జాతీయ నేత శివప్రకాష్‌ హాజరయ్యారు. సమావేశంలో ఇప్పటి వరకూ వ్యవహరించిన రాజకీయ వైఖరి, రానున్న రోజుల్లో అవలంబించాల్సిన రాజకీయ వైఖరి గురించి ఎటువంటి చర్చా లేకపోవడం గమనార్హం. గత టిడిపి ప్రభుత్వ పాలనను, ప్రస్తుత వైసిపి ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ నేతల ప్రసంగాలు సాగాయి. 2024 ఎన్నికల్లో టిడిపితో పొత్తు ఉంటుందని కొందరు నేతలు చెబుతున్న తరుణంలో అధికార వైసిపితోపాటు టిడిపిపైనా నేతలు ఘాటైన విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. జనసేన గురించి ప్రస్తావించని నేతలు మరి ఆ పార్టీ నేత పవన్‌కళ్యాణ్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయబోనని చెబుతున్న మాటల ప్రకారం టిడిపితో జతకట్టేందుకు సిద్ధమవుతారా అనే దానిపైనా నోరుమెదప లేదు. మొత్తంగా అధిష్టానం ఆంతర్యం ఏమిటో రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగానూ వెల్లడించకపోవడం ఆ పార్టీలో నెలకొన్న సందిగ్ధతకు నిదర్శనమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎస్‌సి వర్గీకరణ బిల్లు ఏమైంది: ఎంఆర్‌పిఎస్‌
అధికారం చేపట్టిన వంద రోజుల్లో ఎస్‌సి వర్గీకరణ బిల్లును తీసుకొస్తామని చెప్పిన బిజెపి ఎనిమిదేళ్ల కాలంలో మాదిగలకు ఏం చేసిందని ఎంఆర్‌పిఎస్‌ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును నిలదీశారు. బిల్లును వెంటనే పార్లమెంట్లో పెట్టాలని వారు వీర్రాజుకు వినతిపత్రం అందించారు. కేంద్ర మంత్రి మురళీధరన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు నేతలు అంగీకరించకపోవడంతో ఎంఆర్‌పిఎస్‌ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో వారు మంత్రిని కలిసేందుకు అనుమతించడంతో ఆయనకూ వినతిపత్రం అందించి సమస్య వివరించారు. కార్యక్రమంలో నాగరాజు మాదిగతోపాటు ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు సురేష్‌ మాదిగ, ఎంఎస్‌పి జిల్లా సహాయ కార్యదర్శి రాజారావు, ఉమ్మడి జిల్లా కార్యదర్శి చిన్న సుబ్బారావు, రాజారావు పాల్గొన్నారు.