Aug 16,2023 23:59

సర్టిఫికెట్‌ను చూపుతున్న శ్రీశ్రేయన

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌
మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగిన అంతర్జాతీయ యువజన సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం కాకినాడ వాసికి దక్కింది. ఎంఎల్‌సి కర్రీ పద్మశ్రీ, నారాయణరావు కుమార్తె శ్రీశ్రేయన సెమినార్‌కు హాజరై తన వాణి వినిపించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎదురవుతున్న ఆర్థిక సంక్షోభాలు, యుద్ధాలు, ఆరోగ్య సమస్యలు, రాజకీయ ఒడిదుడుకులు తదితర అంశాలపై యువతలో అవగాహన కల్పించేందుకు ఈ సెమినార్‌ ఏర్పాటు చేశారు. ఏషియా యూత్‌ ఇంటర్నేషనల్‌ మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచంలోని 79 దేశాల నుంచి సుమారు 400 మంది విద్యార్థులు హాజరయ్యారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 24 మంది పాల్గొన్నారు. వీరిలో కాకినాడకు చెందిన శ్రీశ్రేయిన ఒకరు కావడం గమనార్హం. శ్రేయన పెద్దాపురం శ్రీ ప్రకాష్‌ సినర్జీ స్కూల్లో ఇటీవలే ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. సదస్సులో పాల్గొన్న శ్రీ శ్రేయన అడ్రసింగ్‌ ద ఇంక్రీజ్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎకనామిక్‌ డౌన్‌ టర్న్‌ టు ఆటైన్‌ పోస్ట్‌ పాండమిక్‌ స్టెబిలిటీ అనే అంశంపై మాట్లాడారు. ఆమెకు సంస్థ నిర్వాహకులైన ఇంటర్నేషనల్‌ గ్లోబల్‌ నెట్వర్క్‌ ప్రాజెక్టు మేనేజర్‌ తియారా ఫిర్‌ దాస్‌ నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. అంతర్జాతీయ సదస్సులో తన వాణి వినిపించిన శ్రీ శ్రేయనను ఎంపీ వంగా గీతా, ఎంఎల్‌ఎలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కురసాల కన్నబాబు తదితరులు అభినందించారు.