Sep 28,2022 00:25

పనులకు శంకుస్థాపన చేస్తున్న మేయర్‌ తదితరులు

ప్రజాశక్తి - ఆరిలోవ : ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన ముడసర్లోవ పార్కును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల తెలిపారు. దీనిలో భాగంగా మంగళవారం రూ.9.19 కోట్ల వ్యయంతో ముడసర్లోవ రిజర్వాయర్‌ భూముల రక్షణకు, పార్కు చుట్టూ రక్షణ గోడ నిర్మాణానికి వార్డు కార్పొరేటర్‌ కెల్ల సునీతతో కలిసి వారు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రిజర్వాయర్‌ను ఆనుకొని ఉన్న డంపింగ్‌ యార్డులో ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు అక్కరమాని వెంటకటరావు, గొలగాని శ్రీనివాసరావు, కెల్ల సత్యనారాయణ, జివిఎంసి అధికారులు పాల్గొన్నారు.
సామాజిక భవనం నిర్మాణానికి శంకుస్థాపన
9వ వార్డు పరిధి జోడుగుళ్ళపాలెంలో జివిఎంసి నిధులు రూ.1.20 కోట్ల వ్యయంతో సిసి రోడ్డు, సామాజిక భవనం నిర్మాణానికి మంగళవారం మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, కార్పొరేటర్‌ కోరుకొండ స్వాతిదాస్‌ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వార్డులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి ఇంజినీరింగు అధికారులు, వైసిపి నాయకులు ఉమ్మడి దాస్‌, రుద్రరాజు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.