Oct 08,2023 23:40

ప్రజాశక్తి - పంగులూరు
మలేషియా దేశంలోని కౌలాలంపూర్ పట్టణంలో ఈనెల 12నుండి 16వరకు జరిగే జూనియర్ (అండర్ -18) అంతర్జాతీయ బాలబాలికల ఖోఖో పోటీలలో భారతదేశం తరఫున ఒక కోచ్, ఇద్దరు క్రీడాకారులు ఆడేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపికైనట్లు ఎపి ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి విలేకరుల సమావేశంలో ఆదివారం తెలిపారు. ఈ ముగ్గురిలో కోచ్‌గా ఎంపికైన నక్క ఆవులయ్య పంగులూరులోని ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీలో చాలా కాలం కోచ్‌గా పని చేశాడని తెలిపారు. క్రీడాకారుడుగా ఎంపికైన రేజేటి సూరి నాయుడు కూడా ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీలో క్రీడాకారుడుగా ఎదిగి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో బహుమతులు సాధించాడని తెలిపారు.

అంచెలంచలుగా ఎదిగిన ఆవులయ్య
పుల్లలచెరువు మండలంలోని మారుమూల అటవీ గ్రామమైన తెల్లగట్లు గ్రామానికి చెందిన నక్కా ఆవులయ్య (ఎన్ఐసి)ను గత నెల 15నుండి ఈ నెల 8వరకు ఢిల్లీలోని జవహర్లాల్ స్టేడియంలో ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా  ఆధ్వర్యంలో జూనియర్ ఇండియా బాలుర ఖోఖో కోచింగ్ క్యాంపుకి కోచ్‌గా ఆంధ్రప్రదేశ్ ఖోఖో అసోసియేషన్ నియమించింది. ఈనెల 12నుండి 16వరకు మలేషియాలో జరిగే అంతర్జాతీయ ఖోఖో పోటీలకు కోచ్‌గా ఆవులయ్య నియమితులైనట్లు ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కెకెఎఫ్ఐ) ఆదివారం ఉదయం తెలిపింది. ఆవులయ్య 2011-12లో ఎన్ఐఎస్, తరువాత పీహెచ్‌డి చేసి, 2017లో పంగులూరులోని మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలోని ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీలో కోచ్‌గా చేరి సబ్ జూనియర్, నేషనల్, జూనియర్ నేషనల్, సీనియర్ నేషనల్, సౌత్ జోన్ నేషనల్, ఫెడరేషన్ కప్, ఆంధ్ర ప్రదేశ్ కోచ్‌గా వ్యవహరించడమే కాక, అల్టిమేట్ ఖోఖో జట్టుకు కోచ్‌గా వ్యవహరించి బంగారు పథకాలు సాధించడానికి కారకుడు అయ్యారు. ఆవులయ్య ప్రస్తుతం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో చినలాట రఫీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన ప్రతిభను గుర్తించి పలుమార్లు ప్రోత్సహించి, తనను ఈ స్థాయికి తెచ్చిన ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి మేకల సీతారాంరెడ్డికి ఆవులయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఆవులయ్యను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ బాచిన చెంచుగరటయ్య, ఖోఖో అధ్యక్షుడు టిఎస్ఆర్‌కె ప్రసాద్, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ సభ్యులు, ప్రకాశం జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు భాస్కరరావు, కాశీ విశ్వనాథరెడ్డి, వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందించారు.

ప్రతిభ చాటిన క్రీడాకారుడు రేజేటి సూరి నాయుడు
స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలోని ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీలో 8వ తరగతిలో రేజేటి సూరినాయుడు చేరాడు. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లా జెపంగులూరులో ఉంటున్నాడు. ప్రకాశం జిల్లా తరఫున అండర్ -18 విభాగంలో బాలుర ఖో ఖో పోటీల్లో పాల్గొని ఎపి తరఫున గత మార్చి నెలలో పశ్చిమ బెంగాల్లోని బన్స్బరి పట్టణంలో జరిగిన జూనియర్ జాతీయ ఖోఖో పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచాడు. అంతర్జాతీయ జట్టులో (అండర్ -18 విభాగంలో) స్థానం సంపాదించాడు. ఈనెల 12నుండి 16వరకు మలేషియా దేశంలోని కౌలాలంపూర్ పట్టణంలో జరిగే జూనియర్ అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో పాల్గొనబోతున్నాడు. అండర్ -14 విభాగంలో పూణేలో జరిగిన జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొన్నాడు. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జరిగిన ఖేలో ఇండియా జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొన్నాడు. ప్రకాశం జిల్లా ఈదర, కర్నూలు, మొదలైన చోట్ల రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలలో పాల్గొని బంగారు పతకాలు సాధించాడు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన సూరి నాయుడు అంతర్జాతీయ స్థాయి ఖో ఖో పోటీలలో స్థానం సాధించటం చాలా గర్వంగా ఉందని కోచ్, పిఇటి, రాష్ట్ర ఖోఖో కార్యదర్శి మేకల సీతారాంరెడ్డి అన్నారు. ఒకేసారి ఆంధ్రప్రదేశ్ నుండి అంతర్జాతీయ స్థాయి ఖో ఖో కోచ్‌గా నక్కా ఆవులయ్య, క్రీడాకారులుగా రేజేటి సూరి నాయుడు, విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన హేమావతి ఎంపికవటం సంతోషంగా ఉందని అన్నారు. ఖోఖో క్రీడకు ఎంతో సహాయ సహకారాలు అందించిన పంగులూరు గ్రామ పెద్దలు, చైర్మన్ బాచిన చెంచుగరటయ్య, చీఫ్ ప్యాట్రాన్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, వైసిపి ఇన్చార్జి బాచిన కృష్ణ చైతన్య, రాష్ట్ర అధ్యక్షులు టిఎస్‌ఆర్‌కె ప్రసాద్, రిఫరీస్ బోర్డు కన్వీనర్ ఎంవిఎస్ఎస్ ప్రసాద్, మాగుంట చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లా ఖో ఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కరరావు, కాశీ విశ్వనాథరెడ్డి అభినందించారు.