Aug 28,2023 00:18

సంబరాలు చేస్తున్న గ్రామస్తులు, కుటుంబీకులు

ప్రజాశక్తి-హుకుంపేట: మండలంలోని మెరిక చింత పంచాయతీ రంగసింగపాడు గ్రామానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్‌ పోటీల్లో సత్తా చాటిన వలసనైని రవణి ఇంట సందడి నెలకొంది.బాలకృష్ణ, చిట్టమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. రెండవ కుమార్తె రవణి అంధురాలు. ఈమె చిన్నతనం నుంచి క్రీడా రంగంలో మక్కువ చూపించడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా పై భారత్‌ ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన రవణి గెలుపుకు కారణమైంది.దీంతో, పలువురు ఆమెను అభినందించి ప్రశంసించారు. స్వగ్రామంలో ఆమె ఇంట అంగరంగ వైభవంగా సంబరాలు చేశారు. మిఠాయిలు ఒకరికొకరు తినిపించు కున్నారు. ఆదివారం మండలంలో పలువురు నాయకులు, సర్పంచులు, మండల పరిషత్‌ వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, బాకూరు ఎంపీటీసీ నైని సత్తిబాబు, మెరకచింత సర్పంచ్‌ దూసూరు వెంకటరావు, మెరకచింత మాజీ సర్పంచ్‌, సీపీఎం మండల కార్యదర్శి వలసనైని లక్ష్మణ్‌రావు, రాప సర్పంచ్‌ కొప్పుల లక్ష్మయ్య, మత్స్య పురం సర్పంచ్‌ పూజారి సుబ్బారావు గన్నేరు పుట్టు మాజీ సర్పంచ్‌, గిరిజన మహిళ సంఘం హుకుంపేట మండల అధ్యక్షురాలు సూడిపల్లి లక్ష్మీ ప్రమీల, గ్రామ వాలంటీర్‌ వలసనైని సింహచలం, వార్డు మెంబర్‌ సింహచలం, మజ్జి కొండలరావు, మజ్జి సింహచలంలు ఆమె ఇంట సంబరాలు చేశారు.