Sep 24,2023 21:15

పైడిరాజును అభినందిస్తున్న శ్రీరాములు

ప్రజాశక్తి- శృంగవరపుకోట : ఈ ఏడాది ఆగస్టు 19, 20 తేదీల్లో శ్రీలంకలో జరిగిన ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ 400 మీటర్ల పరుగు పందెంలో ఇండియా తరుపున సాలూరు మండలం మామిడిపల్లికి చెందిన కనకల పైడిరాజు పాల్గొని సిల్వర్‌ మెడల్‌ సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం ఆమె హై స్కూల్‌ స్థాయి నుంచి ఈ స్థితికి చేరుకోవడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన తన గురువు డాక్టర్‌ పొట్నూరు శ్రీరాములును ఎస్‌కోటలో కలిశారు. ఈ సందర్భంగా శ్రీరాములు పైడిరాజును అభినందిస్తూ, ఆమెకు పెళ్లి అయిన తర్వాత కూడా క్రీడలు సాధనకు పూర్తిగా సహాయ సహకారాలు ఇస్తున్న భర్త గణపతిని అభినందించారు. క్రీడాకారిని పైడిరాజు మాట్లాడుతూ శ్రీరాములు తన చిన్నతనం నుండి క్రీడలపై వేసిన పునాది నేటికీ చెక్కుచెదరలేదని, ఆయన తమ పాఠశాలకు వ్యాయామ ఉపాధ్యాయులుగా రాకుండా ఉండుంటే తమ జీవితాలు వేరే విధంగా ఉండేవని అన్నారు. మామిడిపల్లి గ్రామం క్రీడా గ్రామంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందంటే అది కేవలం శ్రీరాములు ప్రోత్సహామేనన్నారు. అనేక మంది క్రీడా కోటాలో ఉద్యోగస్తులుగా స్థిరపడ్డామని, తామంతా ఆయనకు రుణపడి ఉంటామని ఆమె చెప్పారు. శ్రీరాములు మాట్లాడుతూ పైడిరాజు ప్రస్తుతం విశాఖపట్నం గీతం డెంటల్‌ కాలేజీలో ఏఎన్‌ఎంగా ఉద్యోగం చేస్తున్నారని, గీతం కాలేజీ యాజమాన్యం కూడా ఆమె క్రీడల్లో రాణించడానికి ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్నారని గీతం యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.