Jul 16,2023 23:33

సత్కరిస్తున్న ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు

ప్రజాశక్తి-మాడుగుల:అంతర్జాతీయ చెస్‌ పోటీలకు మాడుగుల విద్యార్థులు అర్హత సాధించారు. ఈనెల 8,9 తేదీలలో నెల్లూరులో జరిగిన చెస్‌ పోటీలకు మాడుగుల వీనస్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు తాలపు రెడ్డి నాగ చంద్ర వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు పాల్గొని ప్రతిభ చూపారు. ఈ పోటీలలో న్యూజిలాండ్‌, యుఎస్‌ఎ, శ్రీలంక, బంగ్లాదేశ్‌ తదితర దేశాలు పాల్గొన్నాయి. ఇందులో 2.5 పాయింట్లు పొందితే ఫైడ్‌ ఐడి ఇవ్వబడి, తదుపరి పోటీలలో పాల్గొనేందుకు అవకాశం వుంటుంది. ఈ పోటీల్లో మాడుగుల విద్యార్థులు బొడ్డు ప్రదీప్‌ 4 పాయింట్లు, మోల్లి రంజిత్‌ కుమార్‌ 3, పిన బోయిన యువరాజు 3, పినబోయిన ప్రదీప్‌ చంద్ర 2. 5 పాయింట్లు సాధించి, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. వీరు కొద్ది కాలంగా వీనస్‌ కోచింగ్‌ సెంటర్‌ వద్ద శిక్షణ పొందారు. ఈ సందర్భంగా ఆదివారం ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు విద్యార్థులకు దృవపత్రాలు పంపిణీ చేసి, భవిష్యత్‌ లో దేశం తరపున ఆడి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. వీరికి ఆర్థిక ప్రోత్సాహం మొవ్వ బుచ్చయ్య చౌదరి, జల్డు విశ్వేశ్వరరావు సతీమణి మీనాక్షి, భారత నిర్మాణ సేన అందించారు. ఈ కార్యక్రమంలో వీనస్‌ కోచింగ్‌ నిర్వాహకుడు తాలపురెడ్డి నాగచంద్ర, మొవ్వ బుచ్చయ్య చౌదరి, భారత నిర్మాణ సేన ప్రతినిధి గౌరీపట్టపు మహేష్‌కుమార్‌ పాల్గొన్నారు.