Nov 14,2023 23:47

బాలల సినిమాలో ఓ దృశ్యం

ప్రజాశక్తి - తెనాలి : అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీవివేకానంద సెంట్రల్‌ స్కూల్‌ ఆవరణలోని ఎవిఎస్‌ ప్రాంగణంలో ఏపీ చిల్డ్రన్‌ ఫిల్మ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చిత్రోత్సవాల్లో రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌, సాహితీవేత్త రామరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వివేక విద్యాసంస్థల డైరెక్టర్‌ డాక్టర్‌ రవిపాటి వీరనారాయణ రావు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభలో రామరాజు మాట్లాడుతూ చిన్నారుల మేధస్సును పెంచేందుకు చలనచిత్రాలు దోహదపడతాయన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలవైపు విద్యార్థుల మేధస్సును మళ్లించే విధంగా చలనచిత్రాలు రూపొందాలని ఆకాంక్షించారు. వీరనారాయణరావు మాట్లాడుతూ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల ద్వారా దేశ విదేశాల్లోని సంస్కృ, సాంప్రదాయాలను కూడా విద్యార్థులు తెలుసుకునే వీలుంటుందన్నారు. కార్యక్రమంలో చిల్ద్రెన్‌ ఫిల్మ్‌ సొసైటీ ఉపాధ్యక్షులు లలితానంద ప్రసాద్‌, కార్యదర్శి బొల్లిముంత కృష్ణ, నిర్వాహకులు ఎం.శ్రీకాంత్‌, మురళి పాల్గొన్నారు. చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించిన తొలి చిత్రాన్ని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.