Apr 11,2021 13:20

2170వ సంవత్సరం, డిసెంబర్‌ 28..
   అంతరిక్ష పరిశోధనలో అద్భుత విజయాలు సాధించిన ఫలితంగా భూమికి చంద్రునికి మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే చాలామంది చంద్రునిపై స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు కూడా.
శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి రోజు విడిచి రోజూ ఒక షటిల్‌ రాకెట్‌ ఓ యాభై మంది ప్రయాణికులతో చంద్రయానం సాగిస్తోంది. తిరిగి మర్నాడు ఓ యాభై మందితో భూమి మీదకు వస్తోంది. ప్రయాణ సమయం పన్నెండు గంటలు, టికెట్‌ ధర కూడా ఎక్కువ లేకపోవడంతో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

                                                        ***

   అంతరిక్ష కేంద్రం బయట తన పూర్వీకులు ఇచ్చిన కాఫీ హోటల్‌ను పాత పద్ధతిలోనే నిర్వహిస్తూ, జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.. ఏకాకి అయిన అప్పారావు.
ఆ రోజు వచ్చిన కలెక్షన్లు జేబులో వేసుకొని, హోటల్‌ మూసేసి, పరిశోధనా కేంద్రంలో వాళ్లకి ఆఖరి రౌండ్‌ టీ ఇవ్వడానికి బయలుదేరాడు అప్పారావు.

                                                        ***
'ఏటండీ బాబూ? ఏటయిపోనాది? అంతా అడావుడిగా ఉన్నారు?' అడిగాడు అప్పారావు, అంతరిక్ష పరిశోధన ఆఫీసులో ఉన్న ఓ ఆఫీసర్ని, టీ అందిస్తూ.
'ఏం లేదురా! ఈ రోజు రాకెట్‌లో ''పైకి పోవాల్సిన'' ఒకాయన ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నాడు. అందుకే బండి ఆగిపోయింది. మంది తక్కువైతే బరువు తేడా వచ్చి, బండికి ఇబ్బంది కదా? ఏం చేయాలో తెలియడం లేదు' జుట్టు లేని బుర్రను బరుక్కుంటూ చెప్పాడు ఆఫీసర్‌.
'సారూ! ఏటనుకోపోతే, నేను పైకిపోడానికి రెడీ. ఈ భూమ్మీద నాకు ఇంక నూకలు సెల్లిపోనాయి. నేనా, ఒంటిమనిగాన్ని. నా కాడ అయితే డబ్బులు లేవు. కానీ ఈ ఒటేలు తాళాలు హామీగా పెట్టుకుని, నన్ను పంపే మార్గముంటే సెప్పండి, సామాను సదురుకుని వచ్చేత్తా!' భూమ్మీద నిలబడకుండా గంతులేస్తూ చెప్పాడు అప్పారావు.
'అంత టైం లేదుగానొరే! ఆ తాళాలిక్కడెట్టి బండెక్కేరు. మిగతావి నేను చూసుకుంటాను. బట్టలు గట్రా పైనే దొరుకుతాయి. ఒరే ఎవరక్కడీ ఆ డ్రైవర్ని రాకెట్‌ని వేడెక్కించమనండి. ఈ అప్పారావుని తీసుకెళ్ళి, బండిలో కుదేయండి' అని ఆజ్ఞను జారీ చేసి, ఇంక ఆ రోజుకి దుకాణం కట్టేశాడు బోడి బుర్రాయిన.
అదిగో, ఆ రోజు.. అలా ఆరంభమైంది.. అప్పారావు అంతరిక్షయానం.

                                                            ***

   మెట్లు ఎక్కి, రాకెట్‌లో ప్రవేశించబోతూ, 'ఏండోరు, గోపాలం గోరూ! ఈ రోజు డ్యూటీ మీదేనేటీ?' డ్రైవింగ్‌ సీట్లో ఉన్న వ్యక్తిని ప్రశ్నించాడు అప్పారావు.
'నాదే కానీ, ఓరి నీ సిగదరగా! ఇలా బండిలోకి వచ్చి టీలు అమ్మకూడదురా! ముందు నువ్వు దిగొరే! ఓ పాసింజర్‌ రావాలి. ఆయన కోసం వెయిటింగిక్కడ' మూడు శతాబ్దాల నాటి సినీనటులు రావుగోపాలరావు గారిలా చెప్పాడు గోపాలం.
'ఆ పాసింజర్‌ జాగాలోనే నేనొచ్చానండీ బాబా! తలుపు తీయండీ. లోపలికెళ్లి కూసుంటా!' లోపలికెళ్తూ చెప్పాడు.
'లోపల ఖాళీ లేదు కానీ, ఇదిగో ఇక్కడే కూర్చో. ఓ పది నిమిషాలు కళ్లు మూసుకోరోరు. రాకెట్‌ని పైకి లేపుతున్నాను' అంటూ తన పక్క సీటు చూపించాడు గోపాలం.
ఈలోగా కింద నుంచి ఎవరో రాకెట్‌ మీద దడదడా కొడుతూ 'రైట్‌.. రైట్‌ పోనీ గురూ!' అన్న పిలుపు వినబడడంతో, ఆనందంగా గతంలోకి వెళ్లాడు అప్పారావు.

                                                        ***

   కాలం ఎన్ని మార్పులు తెస్తుందో కదా? ఎప్పుడో ఆరేడు శతాబ్దాల క్రితమే ఎక్కడో ఉన్న తుని నుంచి, అక్కడ పనులు లేక ఈ నెల్లూరు వచ్చి స్థిరపడ్డారు తన పూర్వీకులు.
ఆ తర్వాత శతాబ్దాల్లో తన ముత్తాతల ముత్తాతలు చాలా మంది, ఈ దేశంలో ఉపాధి లేక విదేశాలకు వెళ్లి, అక్కడ స్థిరపడ్డారు.
ఆ తర్వాత తరాలు వచ్చేటప్పటికి విదేశాల్లోనూ ఉపాధి లేక, ఉండడానికి జాగా లేక ఆ దేశాల వాళ్ళు నిరాకరించడంతో, మళ్ళీ కొంతమంది స్వదేశంలోని స్వగ్రామం బాట పట్టి, పాత పద్ధతుల్లో జీవనం సాగిస్తున్నారు.
కొంతమంది మాత్రం, 'విదేశాల' వాళ్ళు రానీయకపోవడంతో ఇదిగో ఇలా 'గ్రహాల' మీదకి పోతున్నారు.

                                                       ***

   ఇలా గతంలో తేలియాడుతున్న అప్పారావుకి రాకెట్‌ ఏదో పెద్ద కుదుపుకు లోనవ్వడంతో ఉలిక్కిపడి కళ్లు తెరిచి, 'జాయిగా పోనీయండి గోపాలం గోరూ! కంగారేం లేదు. బాగా పైకి వచ్చేసినట్టున్నాం. ఏనుగులు కూడా ఈగల్లా కనబడుతున్నాయి' అన్నాడు ఆశ్చర్యంగా.
'నిన్ను తగలెయ్యా ! అవి ఈగలే. ఇంకా మనం బయలుదేరలేదు. బండికి స్టార్టింగ్‌ ట్రబుల్‌' చెప్పాడు గోపాలం.
'పోదురూ, నన్ను ఏడిపించడానికి కాకపోతే మన రాకెట్‌ పైకి ఈగలు ఎలా వత్తాయండీ' అనుమానంగా అడిగాడు అప్పారావు.
'ఇదిగో చూడు అప్పారావ్‌, చరిత్ర అడక్కు చెప్పింది విను. మన రాకెట్లో వేసే ఆయిలు సుగర్‌ ఫేక్టరీ నుంచి వస్తుంది, అది తెలుసా! మరి పంచదార మిల్లు అంటేనే ఈగలు..'
'బాగానే వుంది కానీ, అవి మన బండి పైకి ఎలా వత్తాయండీ? ఇడ్డూరం కాపోతేనూ?'
'ఊ....ముందు చెప్పేది విను. మధ్యలో అడ్డురాకు. ఆ ఈగలు ఆయిల్‌ టాంకర్లతో పాటు ఇక్కడకొచ్చేసి, తర్వాత ఈ బండి పైకి వచ్చేశాయన్నమాట. అర్థమయ్యిందా? సరేకానీ, బండి బయలుదేరుతోంది, ఆ బెల్టు పెట్టుకుని తగలడు'
'అబ్బే మనకి బెల్టు అలవాటు లేదండీ. మనదంతా మొలతాడే!'
'నిన్ను తగలెయ్యా! నేను చెప్పేది సీటు బెల్టు గురించి. పెట్టుకోలేదనుకో, నేను మూడో నెంబర్‌ బ్రేక్‌ కొడితే, అప్పడంలా ఎగురుకుంటూ వెళ్లి, భూమ్మీద పడతావ్‌. దప్పళంలోకి కూడా పనికిరావు!' భయపెడుతూ చెప్పాడు గోపాలం.
కిక్కురుమనకుండా సీటు బెల్టు పెట్టుకుని, మళ్లీ జ్ఞాపకాల లోకంలో విహరించసాగాడు అప్పారావు.

                                                        ***

    కాలంతో పాటు మనుషుల పేర్లూ, మాట్లాడే తీరూ భలే మారిపోతాయి కాబోలు. మా ముత్తముత్తాతల, ముత్తముత్తమ్మల పేర్లు విజ్ఞేష్‌, అవ్యరు, అనుష్క, ప్రజ్ఞ.. ఇలా ఉండేవట! మరి అంత నోరు తిరగని పేర్లని ఆ రోజుల్లో ఎలా పిలుచుకునేవారో?
మా నాన్నల తరం దగ్గర నుంచి హాయిగా వీర్రాజు, అప్పారావు, అప్పలనర్సు, పైడితల్లిలాంటి పేర్లు పెట్టడం మొదలెట్టారు, హాయిగా పిలుచుకోవడానికి వీలుగా.
ఇక భాష సంగతి సరేసరి. మా తాత చెప్పేవాడు, వాళ్ల ముత్తాతలు ఆంగ్లం కలిసిన తెలుగు మాట్లాడేవారుట. ఇప్పుడు మేము హాయిగా అచ్చ తెలుగులో మాట్లాడుకుంటున్నాం.
సడన్‌గా రాకెట్‌ ఆగిన శబ్ధం రావడంతో ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు అప్పారావు.

                                                         ***

    'ఓరే! నిన్ను తగలెయ్యా! అలా కునికిపాట్లు పడకురా. నాకూ నిద్ర వచ్చేలా ఉంది. సరేకానీ కిందకి దిగి, ఆ టోల్‌గేట్‌ వాళ్ళు టికెట్‌ ఇస్తారు తీసుకురా!' చెప్పాడు గోపాలం.
'కిందకిదిగడం ఏటండీ బాబూ! మళ్లీ భూమ్మీద పడిపోతానేమో?' భయపడుతూ చెప్పాడు అప్పారావు.
'చరిత్ర అడక్కు చెప్పింది చెయ్యి' గోపాలం బెదిరింపుతో జాగ్రత్తగా కిందకు దిగి, టికెట్‌ తీసుకుని, పైకి వచ్చాడు అప్పారావు.
'కాలు భూమ్మీద లేకపోయినా అక్కడ నడిచినట్లే ఉందండి గోపాలం గోరూ! ఔనూ ఇక్కడ టోల్‌ గేటేటండీ బాబా?' అడిగాడు ఆశ్చర్యంగా.
'ఒరే అప్పారావ్‌, నీకు దేహం తక్కువ, సందేహాలు ఎక్కువ. చెప్తా విను. ఇది పెట్టి ఓ పదేళ్లయ్యిందిరా అబ్బారు! ఈ టోల్‌గేట్‌ పెట్టినాయన తన ఆస్తంతా రాజకీయాల్లో తగలేసుకుని, ఇంక భూమ్మీద లాభం లేదనుకుని ఓ ఫైన్‌ డే ఇలా రాకెట్లో చంద్రగ్రహం మీదికి బయలుదేరాడు.. అక్కడ పార్టీ పెట్టడానికి. అనుకోకుండా ఆ రాకెట్‌కు ఏదో ట్రబుల్‌ వచ్చి ఇదిగో, ఇక్కడ ఆగింది. ఆ డ్రైవర్‌ కిందకు దిగి రిపేరు చేసేలోపు, మనవాడు తన చంద్రయానం యోచన మాని కిందకి దిగి, ఇక్కడే సెటిలైపోయాడు. తరువాత తన పలుకుబడితో పైనా కిందా మేనేజ్‌ చేసి, ఇదిగో ఇలా టోల్‌ గేటు పెట్టేశాడు.. బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు. ఈ టిక్కెట్‌ లేకపోతే మనని చంద్రుని మీద అడుగు పెట్టనివ్వర్రోరు' మొత్తం కథ వివరించాడు గోపాలం.
మళ్లీ బండి పైకి బయలుదేరడంతో అప్పారావు ఆలోచనలు మళ్లీ కింద భూమ్మీదకు చేరాయి.

                                                         ***

    ఈ రోజుల్లో అందరికీ మాతృభాష మీద, మాతృదేశం మీద ప్రేమ ఎక్కువైంది. తనూ తన మాతృభూమిని విడిచి వెళ్లాలనుకోలేదు. కానీ అప్పు ఇచ్చిన ఇంద్రారెడ్డి గారి అనుచరుల వేధింపులు తట్టుకోలేకే ఈ గ్రహాంతర ప్రయాణం.
రెడ్డిగారి అప్పు ఎగ్గొట్టడానికి గతంలో చంద్రమండలం మీదకి పారిపోతూ నూకరాజు, సత్తిబాబు 'ఒరే! ఎప్పుడో శతాబ్దాల క్రితమే మనోళ్లు బేంకులు కాడ అప్పులు తీసుకుని, విదేశాలు పారిపోగా లేనిది, మనం వేరే గ్రహాలకు పోవడంలో తప్పేంటి?' అంటూ చెప్పిన మాటలతో ధైర్యం వచ్చి, అనుకోకుండా తను ఈ ప్రయాణానికి సమాయత్తమయ్యాడు.
ఎక్కడి నుంచో చల్లటి గాలి శరీరానికి తగలడంతో ఉలిక్కిపడి, కిటికీలోంచి కిందకు చూశాడు అప్పారావు.

                                                        ***
కింద ఉన్న జట్కాబళ్ల వారు 'చంద్రానగర్‌ రండి బాబూ! చంద్రానగర్‌! చాంద్రాయణపుట్ట, చాంద్రాయణపుట్ట!! మూన్‌ మూన్‌ పేట్‌ జానేవాలే ఇదర్‌ ఆయీయే!' అరుస్తున్న అరుపులతో ఉలిక్కిపడిన అప్పారావు
'ఏటండీ! గోపాలంగారో, మరిసిపోయి రివర్స్‌ గేర్‌ వేసి మళ్లీ భూమ్మీదకు తెచ్చేశారేటీ కొంపదీసి' అనుమానంగా అడిగాడు.
'ఓరి నీ సందేహాలు దేవుడెట్టుకెళ్లా! మన శాస్త్రవేత్తలు ఎన్నో దశాబ్దాల క్రితమే ఇక్కడికి వచ్చి, భూవాతావరణం సృష్టించార్రా. ఔనొరే చెప్పడం మరిచాను. వాతావరణం కలుషితం కాకూడదని ఇక్కడ ఫోనులూ, వాహనాలూ నిషేధించారు. అన్నీ అశ్వాలూ, అంత'రిక్షా'లే. వారానికి ఓసారి ఇలాంటి సరంజామా వేసుకుని, కింద నుంచి ఓ కార్గో రాకెట్‌ వస్తుందిలే. సరే కానీ నేను రేపు తిరిగి వెళ్లి పోతున్నా! ఎవరికైనా ఏదైనా చెప్పమంటావేటీ?' అడిగాడు గోపాలం.
'నేనిక్కడికి వచ్చినట్లు ఎవరికీ సెప్పకండి గోపాలంగారో, మీకు పుణ్యముంటుంది' అంటూ చంద్ర మండలం మీద మొదటిసారి కాలు పెట్టాడు అప్పారావు.

                                                            ***

   ఎప్పుడో పూర్వీకులు రాసిన గ్రంథాల్లోని వాతావరణం తిరిగి ప్రత్యక్షం కావడంతో, బిత్తరపోయిన అప్పారావు అక్కడ రాసి ఉన్న బోర్డు చూసి తెలుసుకున్నాడు అది 'చంద్రాలొడ్డిబాద్‌' అని. అలా బిక్కుబిక్కుమంటూ చూస్తున్న అప్పారావు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి,
'మీరు ఉద్యోగం చేసి సంపాదించుకోవడానికి ఈ మండలానికి కొత్తగా వచ్చారు కదా?' అడిగాడు చేతిలో ఓ చిన్న డైరీలో ఏదో చూస్తూ.
'ఔనండీ బాబా! భలే కనిపెట్టేశారు. అయితే ఇక్కడా ఉద్యోగాలు ఇప్పించే ఏజెంట్లు ఉన్నారేటండీ?' అంటూ ఆనందపడిపోయాడు. వెతకపోయిన ఉద్యోగం కాలు వద్దకు వచ్చినందుకు.
'ఇదంతా, ఏదో మీలాంటి వారి చలవేనయ్యా!' నవ్వుతూ సమాధానం ఇచ్చాడు ఆ వ్యక్తి.

                                                            ***

   ఓ ఇరవై నిమిషాల తర్వాత, అప్పారావుని ఓ పాక హోటల్‌ వద్దకు తీసుకుని వచ్చిన ఆ వ్యక్తి, 'ఏమండోరు! ఈ వేళ బండిలో మీ క్యాండిడేట్‌ ఇంకోడు దిగాడు!' అంటూ గట్టిగా అరిచాడు, డైరీలోని లిస్ట్‌లో టిక్కు పెట్టుకుంటూ.
లోపలి నుంచి వచ్చిన శతాబ్దాల క్రితం నాటి చలనచిత్ర నటులు జయప్రకాష్‌రెడ్డి గారిలా ఉన్న వ్యక్తిని చూసి, బిక్క చచ్చిపోయిన అప్పారావు, 'ఇంద్రారెడ్డి గోరూ! మీరేటిక్కడీ'' అడిగాడు నిలువెల్లా నీరుగారిపోతూ.
'హమ్మయ్య! నువ్వు వచ్చేసినావూ.. మీ బండపడ.. నా దగ్గర అప్పు తీసుకున్నవాళ్ళు ఎవరూ కనబడరేటి చెప్మా? అని విచారిస్తేనూ. ఆ తరువాత తెలిసింది ఆళ్లెవరూ భూపెపంచకంలో లేరనీ, ఇక్కడ కొచ్చేశారనీ.. ఊ... ఏమిటా ఊగడం? సరిగ్గా నిలబడి చావూ.. మరి డబ్బులు తీసుకున్న వాళ్లంతా ఇక్కడుంటే, నేను కిందుండి చేసేదేటీ? రాకెట్లు కడుక్కోవాల్నా? అందుకే.. నేను కూడా ఈడకొచ్చేసి ఇదిగో ఈ హోటల్‌ పెట్టానూ.. ఇదిగో, ఏజంటబ్బీ! మళ్లీ రెండు రోజుల్లో ఇంకో బండి వస్తోంది, నీకిచ్చిన ఫొటోల లిస్టులో ఎవరైనా కనబడితే ఆళ్లని కూడా లాక్కొచ్చేరు. ఇదిగో లోపలెవరూ? ఓ సారి ఇలా తగలడి ఈ అప్పిగాడ్ని ఆ టీ కాచే చోట కూసోబెట్టండీ!' అని అరవడంతో.. లోపల ఎంగిలి పళ్లేలు కడుగుతున్న సత్తిబాబు, పప్పు రుబ్బుతున్న నూకరాజు ఒకేసారి బయటకు వచ్చారు. అప్పారావుని సగర్వంగా లోపలికి తీసుకెళ్లడానికి. 'హమ్మ ఇంద్రారెడ్డి గోరూ! ఆరు నెలల నుంచీ భూమ్మీద సరిగా కనబడకపోవడానికి కారణం ఇదా?! ఏవో పాత శాస్త్రాల్లో చెప్పినట్లు ''రామేశ్వరం వెళ్లినా కానీ శనీశ్వరం తప్పలేదనట్టు తనకు ఈ ''చంద్రాలొడ్డిబాద్‌ వచ్చినా ఈ ఇంద్రారెడ్డి బాధ తప్పలేదు'' అనుకుంటూ, ఫేంటు పైకి మడిచి, టీ కాచే డ్యూటీలోకి దిగిపోయాడు అప్పారావు.

బుద్ధవరపు కామేశ్వరరావు
98480 47322