Oct 27,2022 23:32

బురదతో అధ్వానంగా ఉన్న చింతూరు గొల్లవీధి రహదారి

ప్రజాశక్తి- చింతూరు
చింతూరు మండల కేంద్రంలో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయి. రోడ్లన్నీ పెద్ద పెద్ద గోతులు పడి రాకపోకలు సాగించడానికి నరకం చూడాల్సి వస్తోంది. చింతూరు ఎస్సీ, ఎస్టీ, బిసి కాలనీలో నడిచి వెళ్లేందుకు కూడా వీలులేకుండా ఉన్నాయి. విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం గోతులను మట్టితోనైనా పూడ్చాలని పంచాయతీ వారిని మొరపెట్టుకుంటే తమ వద్ద నిధులు లేవని తప్పించుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. చిన్నపాటి వర్షానికి రోడ్లపై ఉన్న గోతుల్లో నీరు నిలిచిపోతుంది. ఆ గోతిలో పడి అనేక మంది వాహనచోదకులు గాయాలపాలవుతున్నారు. ఆసుపత్రికి వెళ్లాలంటే ఆటో వారు కూడా తమ ప్రాంతానికి కిరాయికు రావడం లేదని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండిపోతుంది. దీంతో దోమలు వృద్ధి చెంది అనేక రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. రహదారులు, డ్రైనేజీల విషయంపై అధికారులను అడిగితే పంచాయతీలో నిధులు లేవని చెబుతూనే, పోలవరం ముంపు పరిధిలో ఉంది కాబట్టి ఇకపై రోడ్లు, డ్రైనేజీలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరని అధికారులు అంటున్నారని కాలనీవాసులు వాపోయారు. పోలవరం సాకుతో అభివృద్ధి పనులను దాటవేసే ప్రయత్నం అధికారులు, పాలకులు చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ తమకు ఈ కష్టాలు తప్పవా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
గోతులో నడిచి కాళ్లు నొప్పులు పెడుతున్నాయి
రోడ్డుపై ఏర్పడిన గోతులు దాటుకుంటూ ప్రతిరోజు బజారుకు వెళ్లి వస్తుంటే కాళ్లు, వేళ్ళు నొప్పులు వస్తున్నాయి. చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు వీల్లేకుండా వర్షపు నీటితో గోతులు నిండిపోయి ఉంటున్నాయి. ఆటోలు, మోటార్‌ వాహనాలు తరచూ గోతుల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నాయి. పంచాయతీ వారిని మరమ్మతుల కోసం అడిగితే పోలవరం ముంపులో ఉంది కాబట్టి మరమ్మతులు చేయడం కుదరదని తెగేసి చెప్పారు. పోలవరం వచ్చే వరకు మాకు ఈ కష్టాలు తప్పవా? పరిహారం పునరావాసం ఇస్తే ఈ గ్రామం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాం. లేదంటే రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసి డ్యాం కట్టేంతవరకైనా కనీస సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
- మరలపాటి గోపెమ్మ, బిసి కాలనీ, చింతూరు గ్రామం
పదేళ్లగా పట్టించుకోలేదు
పది సంవత్సరాల నుండి పాడైపోయిన రోడ్లకు కనీసం మరమ్మతులు కూడా చేయకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ప్రతిరోజు ఈ గోతులు రోడ్డుపై నడవాలంటే నరకం కనబడుతుంది. దీనిపై పంచాయితీ అధికారులకు, సర్పంచ్‌కు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఎన్నికల సమయంలో వచ్చి రోడ్లు, వీధిలైట్లు వేస్తాం, డ్రైనేజీలు కడతామని చెప్పి మళ్లీ కంటికి కనబడడంలేదు. ఇప్పటికైనా స్థానిక సర్పంచ్‌ పంచాయతీ కార్యదర్శి కనీసం గోతులనైనా కంకరతో పూడ్చి ప్రమాదాల బారి నుండిప్రజలను కాపాడాలి.
- బాసిపోయిన కృష్ణకుమారి,బీసీ కాలనీ గొల్ల బజార్‌, చింతూరు