Dec 19,2021 12:20

వెన్ను విరిగిపోయే పురిటినొప్పుల కొలిమిలో
కొలవలేని యాతనను పంటిబిగువున భరించి
తనకు తాను పురుడుపోసుకుని జన్మనిచ్చింది

ఆకలితో నేను అంగలారుస్తుంటే
నా నోటికి పక్కటెముకలకంటుకున్న రొమ్మునిచ్చింది
పాలు రాలేదనే కోపంతో కసితీరా కొరికితే....
సున్నితంగా విడిపించుకుందే కానీ దండించలేదు
గుండెల మీద తన్నినా నవ్వుతూ భరించిందే కానీ పల్లెత్తుమాట అనలేదు

నా చదువు కోసం దొరగాడి పొలంలో
దుక్కి దున్నే ఎద్దు అయ్యింది
మండే సూర్యుడికి చెమట చుక్కలతో
సవాల్‌ విసిరింది
నా కాళ్ల మీద నేను నిలబడటం కోసం
బొబ్బలెక్కిన పాదాలతోనే బతుకుపోరు చేసింది

మట్టి పనుల వెట్టి చాకిరీతో
నిత్యం చస్తూ బతికింది
కూలీగా వచ్చిన సోలెడు స్టోర్‌ బియ్యం
వండినాక వెక్కిరిస్తే.....
ముత్యమంటి మెతుకులు నాకు పెట్టి
మాడు చెక్కలు తిని ఆకలికి
గుణపాఠం చెప్పింది
తన రెక్కల కష్టాన్ని
నా పుట్టినరోజుకు ఖర్చుపెట్టి..
చినిగిన ముతక చీరతో తాను
కలకాలం సహవాసం చేసింది

మా అమ్మ 'ఫెయిర్‌ అండ్‌ లవ్లీ' పూసుకోని 'అందగత్తె'
'పాయిజన్‌ స్ప్రే', 'పాండ్స్‌ పౌడర్‌' ఎరుగని 'మిస్‌ యూనివర్స్‌'...
'పోచంపల్లి' పట్టుచీర మొఖం కూడా చూడని 'శ్రీమంతురాలు'...

ఒక్క మాటలో చెప్పాలంటే...
ఊరు వెలివేసిన అంటరాని గూడెంలో
ఆరిపోయిన దీపం మా 'అమ్మ'
కోటానుకోట్ల భరతమాతలు కూడబల్కుకుని వచ్చినా...
ఇసుమంత కూడా తక్కువకాని త్యాగం
'మా అమ్మ'

మా అమ్మ లాంటి ఎందరో
'అంటరాని కూలీ తల్లులకు' ఇది అంకితం.
 

విజయసాధు
98859 25925