ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా అంతర పంటలతో అధిక ఆదాయం పొందవచ్చని నాబార్డ్ డిడిఎం టి.నాగార్జున అన్నారు. జట్టు వ్యవస్థాపకులు డి.పారినాయుడు అధ్యక్షతన సోమవారం జీవ పైలెట్ ప్రాజెక్టు చెందిన 40మంది రైతులతో క్షేత్రాల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని 23 ప్రాంతాల్లో మా తోటలో జీవ పైలెట్ ప్రాజెక్టు ఎంపిక చేయడం జరిగిందని, అందులో జట్టు ట్రస్ట్ ఎంపికైనట్టు తెలిపారు. సోమవారం గొరడలోని మా తోట రైతు తాడంగి బంగార్రాజు వ్యవసాయ క్షేత్రంలో నవధాన్యాలు, వాటి ప్రగతిని, వేరుపొడవు, మొక్క పొడవు, శ్రీవరి, వరి నారుమడులను మొదలగు విషయాలు పరిశీలించారు. చేసిన పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. రాయగడ జమ్ములో పువ్వుల లక్ష్మి, పువ్వుల దొరమ్మ మా తోట క్షేత్రాలను పరిశీలించారు. పైలెట్ ప్రాజెక్టు కింద 40మంది రైతులు తమ మొత్తం విస్తీర్ణాల్లో ఏడాది పొడవునా పంటలు పండించుకోవాలని, అన్ని రకాల పోషకాలు కలిగిన పంటలను తమ క్షేత్రాల్లో పండించుకుని ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చేసుకోవాలని సూచించారు. రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి నాబార్డు ఎల్లప్పుడూ తమ పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జట్టు సంస్థ పర్యవేక్షణలో మా తోట రైతులు ఏ విధమైన రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఆర్థిక అభివృద్ధి సాధించడం అభినందించదగ్గ విషయమన్నారు. పండ్ల తోటల్లో అంతర పంటలుగా పసుపు, అల్లం, పైనాపిల్, సారికంద, కందులు, కొర్రలు, సామలు, ఆకుకూరలు, కాయగూరలు, తీగ జాతులు, శ్రీరాగి, గడ్డి పెంపకం మొదలగు పంటలను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం రైతులకు భూసార పరీక్ష కార్డులను అందించారు. కార్యక్రమంలో మా తోట కమిటీ సభ్యులు ఎం.కమల కుమారి, కార్యదర్శి కె.చిరంజీవిలు, జట్టు ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ ఎస్.ప్రహరాజ్, జీవ కోఆర్డినేటర్ జి.ప్రబోధ్, జి.మురళీమోహన్, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.










