Aug 20,2023 21:53

రైతులకు సూచనలు ఇస్తున్న రాష్ట్ర రిసోర్స్‌ పర్సన్‌ ప్రకాష్‌

ప్రజాశక్తి - పాచిపెంట : ప్రకృతి వ్యవసాయ రాష్ట్ర రిసోర్స్‌ పర్సన్‌ కె.ప్రకాష్‌ ఆదివారం అమ్మవలసలో పొలంబడి, ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయంలో అంతర పంటలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కంచెపంటల ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రోత్సహించాలని ప్రకృతి వ్యవసాయ క్యాడర్‌ను ఆదేశించారు. అంతేకాకుండా వ్యవసాయశాఖతో సమన్వయం చేసుకొని ప్రకృతి వ్యవసాయాన్ని రైతు ముంగిటకు తీసుకెళ్లాలని సూచించారు. పాంచాలిలో ప్రయోగాత్మక ఎటిఎం మోడల్‌ కూరగాయల క్షేత్రాన్ని పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రైతులకు ఏడాది పాటు ఆదాయం వచ్చేలా జీవ వైవిధ్యాన్ని పెంపొందింపజేసే కూరగాయల ఎటిఎం నమూనా క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి కె.తిరుపతిరావు అన్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ ఆదాయం వచ్చేలా వంగ బెండ టమోటా ఆకుకూరలు, కూరపాదులు మిరప వంటి రకాలను తక్కువ స్థలంలో ఎక్కువగా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ భూమి లోపల బయట కూడా జీవ వైవిధ్యాన్ని పెంచేలా రైతుకు ఎక్కువ ఆదాయం వచ్చేలా ఈ ఏటీఎం మోడల్‌ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రయోగాత్మకంగా పాచిపెంట మండలంలో రైతుల కోసం ఈ క్షేత్రం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మెంటార్‌ యశోదమ్మ, సిఆర్‌పి తిరుపతి నాయుడు, బాలకృష్ణ, ఐసిఆర్పి రమణ పాల్గొన్నారు