Nov 22,2023 00:05

ఫుట్‌బాల్‌ పోటీల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన స్థానిక ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే 67వ అంతర జిల్లాల ఫుట్‌బాల్‌ పోటీలను మంగళవారం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతాయని చెప్పారు. క్రీడలు ఐక్యతకు చిహ్నం అన్నారు. క్రీడా రంగ అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ, జివిఎంసి 3, 4 వార్డుల కార్పొరేటర్లు గంటా అప్పలకొండ, దౌలపల్లి కొండబాబు, ఎంపిపి దంతులూరి వెంకటశివసూర్యనారాయణరాజు, జివిఎంసి కో-ఆప్షన్‌ సభ్యులు కొప్పల ప్రభావతి, పిఎసిఎస్‌ అధ్యక్షులు అక్కరమాని రామునాయుడు, ఎంపిటిసి సభ్యులు చెల్లూరి నగేష్‌బాబు, వైసిపి మండల అధ్యక్షులు గాడు శ్రీను, నాయకులు పొట్నూరు చంద్రశేఖర్‌, కొప్పల రమేష్‌, ఎం.షణ్ముఖరావు, లక్ష్మణరావు, ఎస్‌జిఎఫ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ టి.నాగేశ్వరరావు, ఫుట్‌ బాల్‌ క్లబ్‌ కార్యదర్శి అక్కరమాని చినబాబు తదితరులు పాల్గొన్నారు.
13 జిల్లాలకు చెందిన 40మంది వ్యాయామ ఉపాధ్యాయులు, 52 మంది కోచ్‌లు, మేనేజర్లు, 20 మంది రిఫరీలు పాల్గొన్నారు. ఆయా జిల్లాల నుంచి 14 ఏళ్ల లోపు బాలబాలికలు 468 మంది హాజరయ్యారు. బాలురు 13జట్లు, బాలికలు 13 జట్లు తలపడనున్నాయి.