ప్రజాశక్తి - దేవరాపల్లి
దేవరాపల్లి మండల కేంద్రంలో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు చేయడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. శారదా నదికి అవతల శ్మశాన వాటిక ఉండడంతో నది ప్రవాహ సమయంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సోమవారం దేవరాపల్లి మాజీ సర్పంచ్ వరదపురెడ్డి చిన్నమనాయుడు భార్య పైడితల్లమ్మ మృతి చెందగా, ఆమె అంతిమ సంస్కారాలకు శారదా నది దాటి శ్మశాన వాటికకు వెళ్లేందుకు బంధువులు తీవ్ర అవస్థలు పడ్డారు.
దేవరాపల్లిలో 27,800పై చిలుక ఓటర్లు ఉండగా, జనాభా ఇంకా ఎక్కువగానే ఉంటుంది. దీర్ఘకాలం పాటు ఈ పంచాయతీని, మండలాన్ని ఏలిన వారు దేవరాపల్లి గ్రామానికి చెందిన వారే. అయినా ఎవరైనా చనిపోతే శ్మశానికి వెళ్లడానికి సరైన దారి లేదు. శ్మశానంలో నిలువ నీడ, సౌకర్యాలు కరువు. శారదా నది అవతల శ్మశానం ఉండడంతో అంతమ సంస్కారాలకు నదిలో నుంచి వెళ్లాల్సిందే. మొన్నటి వరకు నదిలో కాలిబాట ఉండగా, వర్షానికి అది కోట్టుకుపోయింది. దీంతో నదిలోని నీటి ప్రవాహంలో దిగి మృతదేహాన్ని తీసుకెళ్లాల్సి వస్తోంది. నదీ ప్రవాహం ఎక్కువగా ఉంటే నదికి ఇవతల ఒడ్డునే దహన సంస్కారాలు చేస్తున్నారు. శ్మశాన వాటిక సమస్యపై 2017-18లో సిపిఎం ఆధ్వర్యాన దేవరాపల్లి ప్రజలు నిరాహార దీక్ష చేశారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. విశాఖ డెయిరీ నిధులతో శ్మశానంలో చేపట్టిన షెడ్లు నిర్మాణం మధ్యలో ఆపేసి ఆ నిధులు మింగేశారు. దీంతో అంతిమ సంస్కారాలకు తీసుకెళ్లేందుకు, అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు దేవరాపల్లి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు కష్టాలను అర్థం చేసుకొని శ్మశాన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు.










