Jun 14,2023 00:48

మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్‌

ప్రజాశక్తి-రేపల్లె : వైసిపి పాలనలో ప్రచారం తప్ప అభివృద్ధి లేదని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. పట్టణంలోని ఎంసిఎ హాలులో టిడిపి నియోజకవర్గ స్థాయి విస్తత సమావేశం మంగళవారం నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే టిడిపితోనే సాధ్యమని తెలిపారు. వైసిపి అరాచక పాలనతో అన్నివర్గాల ప్రజలు విసిగి పోయారన్నారు. గ్రామీణ రహదారులు అధ్వానంగా ఉన్నా పట్టించుకునే దిక్కులేరన్నారు. కూల్చివేతలతో పాలన ప్రారంభించిన జగన్‌ రెడ్డి రాష్ట్ర సమగ్రాభివద్ధిని కూడా కూల్చి వేశాడని ఆరోపించారు. 2019కి ముందు 4 శాతంగా ఉన్న నిరుద్యోగం నేడు 7 శాతానికి పెరిగినట్లు తెలిపారు. అబద్ధాలే అజెండాగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి విద్యార్థులకు ఉపాధి లేకుండా చేసి ఆంధ్రను మాదకద్రవ్యాలకు అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు. పేద అక్క చెల్లెమ్మలకు టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లుగా పట్టించుకోలేదని తెలిపారు. చెత్త పన్ను, నిత్యవసరాలు, విద్యుత్‌ ఛార్జీలు, పెట్రోల్‌, డీసీల్‌ ధరలు పెంచి పేదలపై పెను భారం మోపారన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాష్ట్రానికి రాజధాని, యువతకు ఉపాధి లేదన్నారు. పెట్టుబడులు కూడా లేకుండా పోయాయిని తెలిపారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని 40 సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్లాడని విమర్శించారు. భవిష్యత్‌కు గ్యారంటీ ఇస్తూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమాఅంటూ వైసీపీ వైసిపి శ్రేణులకు సవాల్‌ విసిరారు. మహాశక్తి ద్వారా మహిళలకు అద్భుతమైన మూడు పథకాలు ప్రకటించినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో సైకో ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపటం తథ్యమని తెలిపారు. ఓటమి భయంతో వైసిపి అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతుందన్నారు. టిడిపి అధికారంలోనికి వచ్చిన వెంటనే యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి అంది స్తామన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, నియోజక వర్గ పరిశీలకులు టి. వీరాస్వామి, టిడిపి నాయకులు పంతాని మురళి ధర రావు, జి. శ్రీనివాసరావు, జివి.నాగేశ్వరరావు, కె.వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, కె.రాము, వసుధ, డి.జయప్రద, వొంగరా శ్రీనివాసరావు పాల్గొన్నారు.