పలువురు ప్రజాప్రతినిధులు డుమ్మా
అధికారులదీ అదేబాట...
అరకొర అంశాలకే పరిమితం
తూతూ మంత్రంగా జడ్‌పి సమావేశం
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
జిల్లాలో వేధిస్తున్న ప్రధాన సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే దిశగా సాగాల్సిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం మొక్కుబడిగా మారింది. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. అరకొర అంశాలను మాత్రమే చర్చించి మమ అనిపించారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 లోపులోనే సమావేశాన్ని ముగించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జడ్‌పి చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన మంగళవారం షెడ్యూల్ ప్రకారం కాకుండా గంట ఆలస్యంగా ప్రారంభమైంది. 2 గంటల వ్యవధిలోనే సమావేశాన్ని ముగించారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ ఎంపీ వంగా గీత, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు కృతికాశుక్ల, హిమాన్షుశుక్లా, తూర్పుగోదావరి జిల్లా జెసి ఎన్.తేజ్‌భరత్, జడ్‌పి సిఇఒ రమణారెడ్డి, అనపర్తి, రాజోలు, రంపచోడవరం ఎంఎల్‌ఎలు, ఇద్దరు ఎంఎల్‌సిలు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులు సైతం సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో పలు సమస్యల పరిష్కారానికి చోటు దక్కలేదు. వివిధ శాఖలకు సంబంధించి 30 అంశాలను ఎజెండాలో పెట్టారు. వ్యవసాయం, ఇరిగేషన్, పౌర సరఫరాలు, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య తదితర 10 శాఖలకు చెందిన అంశాలపై చర్చకే పరిమితమయ్యారు.
అనపర్తి ఎంఎల్‌ఎ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ భూమి గల రైతు బయోమెట్రిక్ ఉంటేనే ధాన్యం కొనుగోలు చేస్తామనే నిబంధన ఈ ఏడాది నుంచి తప్పనిసరి చేయడంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. రైతులు ఎక్కడో ఉంటారని, కౌలు రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తూర్పుగోదావరి జిల్లా జెసి తేజ్ భరత్ మాట్లాడారు. రైతుల బయోమెట్రిక్ తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. గొల్లప్రోలు జడ్‌పిటిసి సభ్యులు లోవరాజు మాట్లాడుతూ రేవతి అనే వరి విత్తనాలను సాగు చేసి అనేక మంది రైతులు నిండా మునిగిపోయారన్నారు. పంటలో సుమారు 50 శాతం వరకు కేళీ విత్తనాలు రావడంతో దిగుబడిపై ప్రభావం చూపనుందన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 600 ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. విత్తనాలు అందించేటప్పుడు నాణ్యత ఎందుకు పరిశీలించడం లేదని వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించారు. దీనిపై కాకినాడ జిల్లా వ్యవసాయ శాఖ జెడి విజయకుమార్ మాట్లాడుతూ రేవతి కంపెనీకి చెందిన కొన్ని విత్తనాలు నకిలీ వచ్చినట్లు తాము గుర్తించామన్నారు. శాస్త్రవేత్తలతో పరిశీలన జరిపించామని, కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చి పరిశీలించగా నష్టపరిహారం వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు మాట్లాడుతూ గత సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రవాణా, గన్ని బ్యాగులు ఖర్చులు నేటికీ ఇవ్వలేదన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో ఆర్‌బికెల పరిధిలో ఉన్న రైస్ మిల్లులకే ధాన్యాన్ని అమ్ముకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా సమస్యలు లేకుండా చూడాలన్నారు. దీనిపై కోనసీమ కలెక్టర్ హిమాన్స్ శుక్లా మాట్లాడుతూ ఖరీఫ్ కొనుగోలుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యు.కొత్తపల్లి జడ్‌పిటిసి గుబ్బల తులసి మాట్లాడుతూ కాకినాడ వాకలపూడి బీచ్ రోడ్డు గోతుల మయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి వేణు మాట్లాడుతూ ఆర్ అండ్ బి అధికారులు కనీసం మరమ్మతులైనా చేపట్టాలని ఆదేశించారు. ప్రజా ప్రయోజనాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, రైతులకు సంబంధించిన ప్రయోజనకర విధానాలు, రహదారులు నిర్మాణానికి అవసరమైన అంశాలు, రబి సీజన్ లో సాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళికలు, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల అంశాలపై సమగ్రంగా సభ్యులు అధికారులతో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలను క్షుణ్నంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్లు తెలిపారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్‌పి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని జడ్‌పి అధికారులు, సభ్యులు చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించారు.










