Oct 17,2023 22:29

పలువురు ప్రజాప్రతినిధులు డుమ్మా
అరకొర అంశాలకే పరిమితం
ఇదీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ సమావేశం తీరు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
జిల్లాలో వేధిస్తున్న ప్రధాన సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే దిశగా సాగాల్సిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ సమావేశం మొక్కుబడి తంతుగా మారింది. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కీలక మీటింగ్‌ లో పాల్గొనవలసి ఉన్నా డుమ్మా కొట్టారు. అరకొర అంశాలను మాత్రమే చర్చించి మమ అనిపించారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 లోపులోనే సమావేశాన్ని ముగించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాల్‌ అధ్యక్షతన మంగళవారం జిల్లా పరిషత్తు సర్వసభ్య సాధారణ సమావేశం జరిగింది. షెడ్యూల్‌ ప్రకారం కాకుండా గంట ఆలస్యంగా సమావేశం ప్రారంభం కాగా సుమారు 2 గంటల వ్యవధిలోనే మీటింగును ముగించారు.
రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు,కాకినాడ ఎంపీ వంగా గీత, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లు కతికా శుక్ల, హిమాన్స్‌ శుక్ల, తూర్పుగోదావరి జిల్లా జెసి ఎన్‌. తేజ్‌ భరత్‌, జెడ్పి సీఈఓ రమణారెడ్డి, అనపర్తి, రాజోలు, రంపచోడవరం ఎమ్మెల్యేలు సత్తి సూర్యనారాయణ రెడ్డి, రాపాక వరప్రసాద్‌, నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, తోట త్రిమూర్తులు మాత్రమే పాల్గొన్నారు. మూడు జిల్లాల నుంచి ఇంకా అనేకమంది ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. అన్ని శాఖల అధికారులు పాల్గొనలేదు. దింతో పలు సమస్యల పరిష్కారానికి చోటు దక్కలేదు.మొత్తం వివిధ శాఖలకు సంబంధించి 30 అంశాలను పొందు పర్చగా వ్యవసాయం, ఇరిగేషన్‌, పౌర సరఫరాలు, ఆర్‌ డబ్ల్యూఎస్‌, వైద్య ఆరోగ్య తదితర 10 శాఖలకు చెందిన చర్చకే పరిమితమయ్యారు.
మూడు జిల్లాల్లో అనేక సమస్యలు వేధిస్తుండగా కొన్ని సమస్యలను చర్చించారు.
అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ భూమి గల రైతు బయోమెట్రిక్‌ ఉంటేనే ధాన్యం కొనుగోలు చేస్తామనే నిబంధన ఈ ఏడాది నుంచి తప్పనిసరి చేయడంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. రైతులు ఎక్కడో ఉంటారని, అయితే కౌలుకు సాగు చేసే రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని సమావేశం దష్టికి తీసుకువచ్చారు. దీనిపై తూర్పుగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌ భరత్‌ మాట్లాడుతూ రైతుల బయోమెట్రిక్‌ తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. గొల్లప్రోలు జడ్పిటిసి లోవరాజు మాట్లాడుతూ రేవతి అనే వరి విత్తనాలను సాగు చేసి అనేక మంది రైతులు నిండా మునిగిపోయారన్నారు. పంటలో సుమారు 50 శాతం వరకు కేలీ విత్తనాలు రావడంతో దిగుబడిపై ప్రభావం చూపనుందని, జిల్లా వ్యాప్తంగా సుమారు 600 ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. విత్తనాలు అందించేటప్పుడు నాణ్యత ఎందుకు పరిశీలించడం లేదని వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించారు. దీనిపై కాకినాడ జిల్లా వ్యవసాయ శాఖ జెడి విజయకుమార్‌ మాట్లాడుతూ రేవతి కంపెనీకి చెందిన కొన్ని విత్తనాలు నకిలీ వచ్చినట్లు తాము గుర్తించామన్నారు. శాస్త్రవేత్తలతో పరిశీలన జరిపించామని, కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చి పరిశీలించగా నష్టపరిహారం వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ గత సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రవాణా, గన్ని బ్యాగులు ఖర్చులు నేటికీ ఇవ్వలేదన్నారు. వచ్చే ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు సమయంలో ఆర్బికేల పరిధిలో ఉన్న రైస్‌ మిల్లులకే ధాన్యాన్ని అమ్ముకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో సుదూర ప్రాంతాలకు చెందిన రైస్‌ మిల్లులకు ధాన్యాన్ని పంపడం వలన వేలాదిమంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రవాణా, తేమ సమస్యలతో నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. కావునా రైతులు దగ్గర్లోనే ధాన్యాన్ని అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రవాణా సమస్యలు లేకుండా చూడాలన్నారు. దీనిపై కోనసీమ కలెక్టర్‌ హిమాన్స్‌ శుక్లా మాట్లాడుతూ ఖరీఫ్‌ కొనుగోలుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యు.కొత్తపల్లి జెడ్పిటిసి గుబ్బల తులసి కుమార్‌ మాట్లాడుతూ కాకినాడ వాకలపూడి బీచ్‌ రోడ్డు గోతుల మయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి వేణు మాట్లాడుతూ జిల్లాలో ఇదేవిధంగా పలుచోట్ల రహదారులు గోతులమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆర్‌ అండ్‌ బి అధికారులు కనీసం గోతులు మరమ్మతులైనా చేపట్టాలని ఆదేశించారు.జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ను విజయవంతంగా ముగించేందుకు వ్యవసాయ, ఇరిగేషన్‌ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.ప్రజా ప్రయోజనాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలు, రైతులకు సంబంధించిన ప్రయోజనకర విధానాలు, రహదారులు నిర్మాణానికి అవసరమైన అంశాలు, రబి సీజన్‌ లో సాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళికలు, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల అంశాలపై సమగ్రంగా సభ్యులు అధికారులతో చర్చించినట్లు ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలను క్షుణ్నంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్‌ డా. కతికా శుక్లా, డా. బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, తూర్పుగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌ తెలిపారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాల పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్తు అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు, చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించారు.