Jul 23,2023 22:12

స్కానింగ్‌ ప్రతీకాత్మక చిత్రం

*నిబంధనలు పాటించని పలు ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లు
*పరీక్షలకు వారు చెప్పిందే రేటు
*రోగుల నుంచి నిలువు దోపిడీ
*అంతంతమాత్రంగా వైద్యారోగ్యశాఖ తనిఖీలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి :
రోగి చెప్పిన లక్షణాలతోనే గతంలో వైద్యం చేసే పరిస్థితి ఉండగా, ఇప్పుడు ప్రతిదానికీ స్కానింగ్‌ చేయిస్తే గానీ వ్యాధి ఏమిటో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఏ చిన్న జబ్బు చేసినా వైద్యులు స్కానింగ్‌కే రిఫర్‌ చేస్తున్నారు. దీంతో డయాగస్టిక్‌ సెంటర్లు, స్కానింగ్‌ కేంద్రాలు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. కనీస నిబంధనలు, పూర్తిస్థాయి అనుమతి పత్రాలు, అర్హతా ప్రమాణాలు పాటించకుండానే చాలామంది ల్యాబ్‌లు నిర్వహిస్తూ రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెడికల్‌ ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్ల ఏర్పాటులో ప్రత్యేక కమిటీలు సైతం మొక్కుబడిగా పనిచేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మెడికల్‌ ల్యాబ్‌ల పరిస్థితి ఆడిందే ఆట పాడిందే పాటగా అన్నట్లుగా ఉంది. పరీక్షల కోసం వచ్చే రోగుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో స్కానింగ్‌ సెంటర్లు, మెడికల్‌ ల్యాబ్‌లు మొత్తం 103 వరకు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ పరిధిలో 18, ప్రయివేట్‌ వ్యక్తులు, సంస్థల ఆధ్వర్యంలో 85 ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులు నిర్ధేశించిన నిబంధనలు పాటిస్తున్నా, ప్రయివేట్‌ ల్యాబ్‌లు కొన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గర్భస్థ పిండ, లింగ నిర్ధారణ పరీక్షల చట్టాన్ని పక్కాగా అమలు చేయాల్సిన ప్రయివేట్‌ స్కానింగ్‌ సెంటర్లు చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం గర్భిణులు వేచి ఉండే గది, స్కానింగ్‌ రూమ్‌ ప్రవేశ ద్వారం సమీపంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సెంటర్‌లో నిపుణులైన గైనకాలజిస్టులు, రేడియోలాజిస్టులు ఉండాలి. ఏ పరీక్షకు ఎంత రుసుము చెల్లించాలో బోర్డును ప్రదర్శించాలి. గర్భిణులు, రోగుల వివరాలను ఫారం-ఎఫ్‌ అనే రిజిస్టర్‌లో నింపాలి. ఇవేవీ సక్రమంగా అమలు చేయడం లేదని తెలుస్తోంది. గత నెలలో అధికారులు చేపట్టిన తనిఖీల్లో అనేక లోపాలను గుర్తించారు. కాశీబుగ్గలోని ఓ ఆస్పత్రిలో పాడైన స్కానింగ్‌ యంత్రాన్నే వినియోగిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.

అంతంతమాత్రంగానే తనిఖీలు
స్కానింగ్‌ సెంటర్లు, మెడికల్‌ ల్యాబ్‌ల్లో స్కానింగ్‌, రక్త, ఇతర పరీక్షలకు ప్రభుత్వం నిర్ధేశించిన రేట్లు ఎక్కడా అమలు చేయడం లేదు. కొన్ని యాజమాన్యాలు దారుణంగా రోగులను దోచేస్తున్నాయి. శ్రీకాకుళం నగరంలోని డే అండ్‌ నైట్‌ కూడలి సమీపంలో పాలకొండ రోడ్డు మార్గంలో ఉన్న ఓ డయాగస్టిక్స్‌లో వారే చెప్పిందే రుసుముగా ఉంది. ఏ పరీక్షకు ఎంత ధర చెల్లించాలో కనీసం బోర్డునూ ప్రదర్శించలేదు. జిల్లా వైద్యారోగ్యశాఖకు చెందిన ఓ ముఖ్య అధికారి బంధువు నిర్వహిస్తుండడంతో అడిగే వారే లేకుండా పోయారు. ఒకసారి అధికారులు తనిఖీలకు వెళ్లినా చర్యలు మాత్రం తీసుకోలేదు.

కమిటీ ఏం చేస్తోంది
జిల్లాలో డయాగస్టిక్స్‌, లేబొరేటరీలు, స్కానింగ్‌ సెంటర్ల పర్యవేక్షణకు జిల్లా వైద్యారోగ్యశాఖ పర్యవేక్షణలో ఒక కమిటీ ఉంది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షితో పాటు అడిషనల్‌ డిఎంహెచ్‌ఒ కె.అనురాధ, రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ శ్రీదేవి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ పి.వి లింగరాజు, జిల్లా మలేరియా నివారణ అధికారి ఆర్‌.వి.ఎస్‌ కుమార్‌ సభ్యులుగా ఉన్నారు వీరంతా నెలలో కనీసం 30 సెంటర్లను పరిశీలించాల్సి ఉంటుంది. లేబొరేటరీలు, డయాగస్టిక్స్‌ను సందర్శించి నిబంధనల ప్రకారం అక్కడ అన్నీ ఉన్నాయో లేదో పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత తాము గుర్తించిన లోపాలను పొందుపరిచి ప్రభుత్వానికి నివేదించాలి. ఇవేవీ సక్రమంగా జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు అంతా బాగానే ఉందంటూ నివేదికలు ఇస్తుండగా మరికొందరు మొక్కుబడిగా నివేదికలను అందజేస్తున్నట్లు తెలుస్తోంది.

పిసిపిఎన్‌డిటి చట్టం అమలుపై ప్రభావం
జిల్లాలో గర్భస్థ పిండ పూర్వ, లింగ నిర్ధారణ పరీక్షల చట్టం (పిసిపిఎన్‌డి యాక్ట్‌) అమల్లో జిల్లా వైద్యశాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఉన్న సెక్స్‌ రేషియో గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ప్రస్తుతం ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 954 మంది ఆడ శిశువులు ఉన్నారు. ఆడ పిల్ల అని తెలిసిన తర్వాత గర్భంలోనే తుంచేస్తున్నట్లు తెలుస్తోంది. పలాస, వజ్రపుకొత్తూరు తదితర ప్రాంతాల్లో ఆడ శిశువుల జననం తక్కువగా ఉన్నట్లు గతంలో చట్టంపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో స్కానింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా వైద్యారోగ్యశాఖ పెద్దగా దృష్టి సారించినట్లుగా కనిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు పక్కాగా తనిఖీలు నిర్వహించి, స్కానింగ్‌లతో పాటు పరీక్షల పేరిట దోపిడీకి చెక్‌ చెప్పాలని కోరుతున్నారు.

పక్కాగా తనిఖీలు నిర్వహిస్తున్నాం
మెడికల్‌ ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. లోపాలను గుర్తించి సంబంధిత యాజమాన్యాలకు చెప్తున్నాం. పాటించని వారి వివరాలను కలెక్టర్‌కు నివేదిస్తున్నాం. జిల్లాలో కొన్ని మండలాల్లో ఆడపిల్లల పుట్టుక తక్కువగా ఉండడానికి కారణం ఒడిశాలో స్కానింగ్‌ చేయించుకుంటున్నారనే అనుమానాలు ఉన్నాయి. ఒడిశా సరిహద్దు ప్రాంతాల అధికారులు, స్కానింగ్‌ సెంటర్లు, డయాగస్టిక్స్‌ నిర్వాహకులతో త్వరలో సమావేశం నిర్వహించి కట్టడి చేస్తాం.
- అనురాధ, అడిషనల్‌ డిఎంహెచ్‌ఒ