నిరంతరం ప్రయత్నం, అంకితభావంతో కృషి చేస్తే విజయం దానంతట అదే తలుపు తడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇందుకు దృఢ సంకల్పం అవసరం. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన నిజ జీవితకథను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) ఛైర్మన్ శ్రీకాంత్ మాదవ్ వైద్య. పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి కూతురు ఆర్య రాజగోపాలన్‌ను ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. ఎందుకంటే ఆమె సాధించిన విజయం సాధారణమైనది కాదు. భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో సీటు సంపాదించడం. ఈ సందర్భంగా ఆ యువతిని అభినందించారు. కంపెనీలో ప్రతి ఒక్కరూ ఆమె కృషికి, అంకితభావానికి గర్వపడుతున్నారని ఆయన తెలిపారు. ఆ వివరాలను ఓ సారి పరిశీలిస్తే..!
ఆర్య రాజగోపాలన్ తండ్రి రెండు దశాబ్దాలుగా కేరళలోని పయ్యానూరు పెట్రోల్ బంకులో అటెండెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి బజాజ్ మోటార్స్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఎన్నో ఆర్థిక సమస్యల నడుమ తమ కూతురును ఉన్నత చదువులు చదివించాలని భావించారు. ఇందుకోసం ఎంతగానో శ్రమించారు. తండ్రిది చిన్న ఉద్యోగమే అయినప్పటికీ ఆర్య చదువుల్లో ఎప్పుడూ ముందుండేది. ఎన్‌ఐటీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకున్న ఆర్య రాజగోపాలన్, ఎంటెక్‌ను ఐఐటీ కాన్పూర్ నుంచి పూర్తి చేయనుంది. అక్కడ పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సు చదువనుంది. ఈ స్ఫూర్తిదాయకమైన నిజ జీవితకథను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) చైర్మన్ శ్రీకాంత్ మాదవ్ వైద్య. పెట్రోల్ బంకులో తండ్రి-కూతురు దిగిన ఫొటోను కూడా ఈ సందర్భంగా షేర్ చేశారు. తద్వారా పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి కూతురు ఆర్య రాజగోపాలన్‌ను ప్రపంచానికి ఆయన పరిచయం చేశారు. భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో సీటు సంపాదించిన ఆ యువతిని అభినందించారు. ఈ ట్వీట్‌తో సోషల్ మీడియాలో ఆర్య రాజగోపాలన్‌కు పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల ఆ తండ్రి కష్టానికి తగిన ఫలితం దక్కిందని ఆర్య విజయాన్ని కొనియాడుతున్నారు. నెటిజన్లే కాకుండా ప్రముఖులు కూడా ఆమెను ప్రశంసిస్తున్నారు.
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరీ ట్విట్టర్ వేదికగా ఆమెను అభినందించారు. ఆమె విజయం.. ఇంధన రంగానికి సంబంధించిన తమకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. తండ్రి, కూతుళ్లు స్ఫూర్తిదాయకంగా నిలిచారని, తండ్రి కష్టాన్ని చూస్తూ చదువుకున్న ఆర్య ఈ రోజు తన తండ్రి గర్వపడే స్థాయికి ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు. అందరూ కలలు కనే ఐఐటీలో సీటు దక్కించుకుని ఎంతోమంది పేద విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
ఆర్య చిన్నప్పటి నుంచి విద్యలో స్థిరమైన ప్రతిభను కనబరిచేది. ఆమె ఉన్నత పాఠశాలలో 100 శాతం, హయ్యర్ సెకండరీలో 98 శాతం మార్కులు సాధించింది. కాలికట్‌లోని ప్రతిష్టాతక్మ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 7.83 సిపిఐ (క్యుమిలేటివ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్)తో మెరిట్ సాధించింది. 8.33 సిపిఐతో ఐఐటి కాన్పూర్‌కు చేరుకుంది.
ఆశలు వమ్ము కాలేదు..
తమ కూతురు విజయానికి ప్రశంసలు రావడంతో ఆమె తండ్రి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కుమార్తె భవిష్యత్తు కోసం తాను పెట్టుకున్న ఆశలు వమ్ముకాలేదని రాజగోపాల్ అన్నారు. మా ఆదాయాలు చాలా తక్కువ. ఆర్య రాజాగోపాలన్ చాలా కష్టపడి చదివింది. జీవితంలో అనేక దశలను అధిగమించి, ఈ విజయాన్ని దక్కించుకోడం మా అదృష్టమన్నారు. ఇండియన్ ఆయిల్ ఛైర్మన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2005 నుంచి తాను ఇదే కంపెనీలో పనిచేస్తున్నట్లు చెప్పారు. తమ కూతురు సాధించిన గొప్ప విజయం తమలాంటి పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అన్నారు.