పార్వతీపురం: అంకిత భావంతో విధులు నిర్వహించి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలవాలని, శిక్షణలో ఉన్న సివిల్ సర్వీసెస్ బ్యాచ్ అభ్యర్థులకు కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. సివిల్ సర్వీసెస్ బ్యాచ్ అభ్యర్థులు జిల్లాలో గత పది రోజులుగా అధ్యయన పర్యటనకు వచ్చి వివిధ ప్రాంతాలలో పర్యటించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు. సివిల్ సర్వీసెస్ అధికారులుగా వివిధ ప్రాంతాల్లో వివిధ హౌదాల్లో పని చేయడం జరుగుతుందని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో భౌగోళిక స్థితిగతులు, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, తదనుగుణంగా మంచి ప్రణాళికలు రూపకల్పన చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుత పర్యటన గ్రామీణ ప్రాంతాలపై అవగాహనకు, ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహనా దోహదం చేస్తుందని అన్నారు. ప్రజలకు చేరువ కావడం అత్యావశ్యమని, వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారించడంలో సంతృప్తి లభిస్తుందని పేర్కొన్నారు. యువ అధికారులుగా సమాజ సేవలో నిమగం కావాలని, భవిష్యత్తులో మంచి అధికారులుగా రాణించాలని ఆయన ఆకాక్షించారు. కార్యక్రమంలో సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కల్పనా కుమారి, శిక్షణలో ఉన్న సివిల్ సర్వీసెస్ బ్యాచ్ అభ్యర్థులు పాల్గొన్నారు.










