ప్రజాశక్తి - నిజాంపట్నం : అధికారులు అంకితభావంతో పని చేయాలని ఎంపిపి మోపిదేవి విజయనిర్మల వెంకట హరినాథ్ బాబు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపిడిఒ నర్రా నాగలక్ష్మి అధ్యక్షతన బుధవారం నిర్వహిం చారు. ఈ సందర్బంగా ఎంపిపి రాబోవు కాలం వేసవిలో మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు అంకితభావంతో పనిచేయాలని తెలిపారు. వేసవికాలం దష్ట్యా తీర ప్రాంత గ్రామాల్లో తాగునీటి, విద్యుత్, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించారు. ఎంపిటిసిలు, సర్పంచులు మాట్లాడుతూ తమ గ్రామాల్లో విద్యుత్, డ్రైనేజీ సమస్యల వల్ల వర్షాకాలంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వేసవి కాలంలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తే వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు ఉండని తెలిపారు. జడ్‌పిటిసి నర్రా సుబ్బయ్య మాట్లాడుతూ ప్రజలు తాగునీటి సమస్యలతో ఇబ్బందులకు గురికాకుండా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తీరప్రాంత మండలం అయినందున పంచాయతీ సమస్యలు ఉన్న గ్రామాలను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దారు ఇక్బాల్ ,ఎంఇఒ హరిబాబు, ఎంపిటిసి నాజర్ ఖాన్, వైస్‌ఎంపిపిలు సుబ్బారావు, చంటి, ఎంపిటిసిలు, సర్పంచులు ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










