Mar 15,2022 06:51

   రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆసాంతం అంకెల విన్యాసాలకే పరిమితమైంది. ఊహల పల్లకిలో విహరించింది. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభంలో గవర్నర్‌ ప్రసంగంలోనే సర్కారుకు దిశ దశ లేదని తేలిపోగా బడ్జెట్‌లో అదే ధోరణి ఆవిష్కృతమైంది. వచ్చే సంవత్సరం మొత్తంగా రూ.2,56,256.56 కోట్ల ఖర్చును ఘనంగా ప్రతిపాదించినప్పటికీ ఏ కోణంలో చూసినా అది సాకారం కావడం దుర్లభమని ప్రభుత్వం వెల్లడించిన అంకెలే చెబుతున్నాయి. నిరుడు ప్రతిపాదించిన బడ్జెట్‌లో 83 శాతమే ఖర్చు చేశారు. దాదాపు 37 వేల కోట్లు ఖర్చు చేయలేదు. ప్రస్తుత ఏడాదికి 2.29 లక్షల కోట్లు ప్రతిపాదించి సవరించిన అంచనాల్లో 2.09 లక్షల కోట్లకు తగ్గించారు. ఈ అనుభవం ఉండగా వచ్చే ఏడాది భారీ బడ్జెట్‌ అన్నా వాస్తవ వ్యయం ఎంత ఉంటుందో తెలీదు. ఆదాయం అంచనాలు కోటలు దాటుతుండగా వాస్తవ లభ్యత గడపలు దాటట్లేదు. నిరుడు రెవెన్యూ ఆదాయం 1.61 లక్షల కోట్లు ఆశించగా 1.17 లక్షల కోట్లొచ్చింది. జరుగుతున్న ఏడాదిలో 1.77 లక్షల కోట్లు ఆశించగా జనవరి నాటికి 1.11 లక్షల కోట్లే లభించింది. పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్నా వచ్చే ఏడాది ఏకంగా రెవెన్యూ ఆదాయం 1.91 లక్షల కోట్లుగా పేర్కొనడాన్ని అత్యాశ అనాలో భ్రమ అనాలో అర్థం కాదు.
    కేంద్రం నుండి రావాల్సిన నిధులు సరిగ్గా అందకపోయినా బడ్జెట్‌లో గొప్పలకు పోవడం వింతల్లో వింత. వచ్చే ఏడాది బడ్జెట్‌లో అప్పులే రూ.64 వేల కోట్లు. వాటిలో బహిరంగ రుణాలు రూ.55 వేల కోట్లు. ఏ పూటకాపూట రుణాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపడం ఆర్థిక స్థితికి ప్రమాద సంకేతం. ప్రతి నెలా 10 వేల కోట్ల అప్పులు ఈ సర్కారుకు అత్యవసరంగా మారింది. ఇన్ని అప్పులూ చేసి అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. ఏ రాష్ట్రమైనా అది చేసే మూల ధన వ్యయమే సుస్థిర అభివృద్ధికి గీటురాయి. నిరుడు కేపిటల్‌ వ్యయం పద్దు కింద నికరంగా ఖర్చు పెట్టింది 18 వేల కోట్లు. ఈ ఏట ఘనంగా 31 వేల కోట్లన్నా, అదే 18 వేల కోట్లకు సవరించారు. వచ్చే ఏట 30 వేల కోట్లంటే ఎలా నమ్మేది? తమది నాలుగు స్తంభాల పాలనగా అభివర్ణించారు విత్త మంత్రి బుగ్గన. మౌలిక వసతుల కల్పన స్తంభం పటిష్టంగా ఉండాలంలే కేపిటల్‌ పద్దు పెరగాలి. అదేమీ మచ్చుకైనా కనిపించదు. ఈ కాలంలో ప్రజలపై పన్నులకు హద్దే లేదు. స్టేట్‌ ట్యాక్స్‌ నిరుడు 57 వేల కోట్లొచ్చింది. ఈ ఏట 85 వేల కోట్లనుకొని 73 వేల కోట్లకు సవరించారు. వచ్చే ఏట 91 వేల కోట్లంటున్నారు. ఎకాయికిన 18 వేల కోట్లు అదనంగా రావాలంటే అదనపు పన్నులేస్తారన్నమాట. పన్నేతర ఆదాయం 11 వేల కోట్లు వస్తుందంటున్నారు. 'బిల్డ్‌ ఎ.పి'ని పరుగులు పెట్టించి ప్రభుత్వ భూములు అమ్ముతారన్నమాట. ఇంత చేసినా రెవెన్యూ ఆదాయ లోటు 17 వేల కోట్లు, ద్రవ్యలోటు 48 వేల కోట్లు అనడంతో ఆర్థిక స్థితి గాడి తప్పిందనే భావించాలి.
    ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని చేసే ప్రచారం పాక్షికత్వంతో కూడుకున్నది. సర్కారీ వ్యయంలో నగదు బదిలీల వాటా కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ కోతలూ కొనసాగుతున్నాయి. వివిధ నగదు బదిలీలకు ఈ సంవత్సరం 48 వేల కోట్లు ప్రతిపాదించి 39 వేల కోట్లకు సవరించారు. ఏడెనిమిది వేల కోట్లు కోసేశారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానాన్ని, విద్యుత్‌ రంగంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను రాష్ట్ర సర్కారు వేగంగా అమలు చేస్తోంది. ఇది నష్టదాయకం. యువతకు స్వయం ఉపాధి కల్పించాల్సిన కార్పొరేషన్ల నిధులు నగదు బదిలీల కిందే చూపుతున్నారు. వ్యవసాయ బడ్జెట్‌ అంకెల గారడీకి పరాకాష్ట. ఉపాధి హామీ, ఉచిత విద్యుత్‌, ఇరిగేషన్‌ పద్దులు కలిపేశారు. వ్యవసాయ సంక్షోభం సమయాన వ్యవసాయ పద్దుకు రూ.1,400 కోట్లు తగ్గాయి. వాస్తవంగా భూమిపై శ్రమించే కౌలు రైతుల ఊసే లేదు. పైపెచ్చు డ్రోన్లంటూ కేంద్రం మార్గదర్శకత్వంలో కార్పొరేటీకరణ మంత్రం జపించారు. అమరావతి, పోలవరం సహా ఇరిగేషన్‌, గృహనిర్మాణం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి కీలక రంగాలన్నింటికీ నిధులు తక్కువే. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని వదిలేసి వికేంద్రీకరణ అనడం తప్పుదారి పట్టించడమే. విభజన సమస్యలు, మాంద్యం, కరోనా ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. అయినా స్థూలోత్పత్తి, తలసరి ఆదాయాలు గణనీయంగా వృద్ధి చెందాయనడం విశ్వసించేలా లేవు.