Dec 19,2022 00:02

ఉత్సవ మూర్తులను మోస్తున్న ముత్యాల వెంకటేశ్వరరావు దంపతులు,

ప్రజాశక్తి-అనకాపల్లి
ప్రముఖ వ్యాపారవేత్త, ముత్యాల గ్రూప్‌ ఆఫ్‌ ఇండిస్టీస్‌ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు, సూర్య కుమారి దంపతులు, వారి కుమారులు రాజేష్‌, సతీష్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణం సందర్భంగా ఉత్సవమూర్తులను ముత్యాల వెంకటేశ్వరరావు తన తలపై పెట్టుకొని కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మధుపర్క సమర్పణ, మంగళసూత్ర ధారణ వంటి అంశాలు ఘట్టాలతో సహా వివరించారు. శ్రీనివాస కళ్యాణ ఘట్టాలకు అనుగుణంగా వివిధ కళా బృందాలు, అన్నమయ్య సంకీర్తనలు, భక్తి పాటలు వీనుల విందుగా విందుగా సాగాయి. వాణి విశ్వనాథ్‌, మన్నార్‌ చోప్రా, సురభి తదితర సినీ తారలు వేదికపైనే కూర్చుని శ్రీవారి కల్యాణాన్ని తిలకించారు. అనకాపల్లి పట్టణం ఒక్కసారిగా గోవింద నామస్మరణతో మార్మోగింది. ఇటువంటి కార్యక్రమం తాము గతంలో ఎన్నడూ చూడలేదని పలువురు ముత్యాల వెంకటేశ్వరరావును అభినందించారు.