ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్
ప్రభుత్వాన్ని ఢకొీట్టే మాదిరిగా అంగన్‌వాడీల 36గంటల నిరసన దీక్ష సాగింది. దీక్షల నేపథ్యంలో సోమవారం ఉదయం 10గంటలకే కార్యకర్తలు, ఆయాలు బస్సులు, ఆట్లో తరలివచ్చారు. నిప్పులు కక్కుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా కలెక్టరేట్ వేలాది మందితో నిండిపోయింది. దీంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిఐటియుతో సహా పలు కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అదే స్ఫూర్తితో అంగన్‌వాడీలంతా రాత్రి వర్షం కురుస్తున్నా కలెక్టరేట్ ఎదురుగా ఏర్పాటు చేసుకున్న టెంటులోనే భోజనాలు చేసి బస చేశారు. ఇక ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుం టామంటూ ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్ప్‌ర్స్ నాయకులు హెచ్చరించారు. వేతనాల పెంపు, గ్రాడ్యుటీ చెల్లింపు సహా మిగిలిన సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనినాయకులు హెచ్చరించారు.
అనంతరం ధర్నానుద్దేశించి యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి, అధ్యక్ష ప్రధానకార్యదర్శులు పి.సరళ, జి.జ్యోతిలక్ష్మి, కోశాధికారి బి.అమరవేణి, రాష్ట్ర కమిటీ నాయకులు వి.రామలక్ష్మి మాట్లాడుతూ ఐసిడిఎస్ పరిరక్షణ కోసం, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్, పిఎఫ్, ఇఎస్‌ఐ, గ్రాట్యూటి అమలు చేయాలని, ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు. 48ఏళ్లగా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అనేక సేవలందిస్తున్న అంగన్వాడీలకు కనీసం ఉద్యోగభద్రత కల్పించలేదన్నారు. కేంద్రంలో బిజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9ఏళ్లలో అంగన్వాడీల సమస్యలు పరిష్కారానికి చొరవ చూపలేదని, పైగా సమస్యలు మరింత జఠిలమయ్యాయని అన్నారు. ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా సెంటర్లు కుదించటానికి నూతన విద్యావిధానాన్ని తీసుకువచ్చిందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచిందన్నారు. అందుకనుణంగా వేతనాలు పెంచాలన్నారు. తమ యూనియన్ పోరాటాల ఫలితంగా 2018లో అంగన్వాడీ వర్కర్లకు 1500, హెల్పర్కు 750, మినీ వర్కర్కు 1250 పెంచనున్నట్టు చెప్పినప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. 2017 నుండి టిఎ బిల్లులు ఇవ్వడం లేదన్నారు. లబ్ధిదారులను కుదించటానికి పోషణ ట్రాక్ యాప్ను తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ సమస్యలను పరిష్కరించాలని, హామీలు నెరవేర్చాలని పలు మార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వానికి పట్టలేదన్నారు. 36గంటల నిరవధిక దీక్షలతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. లేదంటూ భవిష్యత్తులో తమ విలువేంటే చూపిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాకు సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దావాల రమణారావు, వై.మన్మధరావు, కోశాధికారి జి.వెంకటరమణ, నాయకులు వి.ఇందిర, ఎన్‌వై నాయుడు, బివి రమణ, సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు సంఘీభావం తెలిపారు. ధర్నాలో జిల్లాలోని 15 మండలాల నుంచి వచ్చిన ఆ సంఘం నాయకులు, కార్యకర్తలతో పాటు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులకు కొల్లి సాంబమూర్తి, వెంకటరమణ, జి.ప్రసాదు, ఎస్.సురేష్, టి.ప్రభావతి, ఎ.నారాయణమ్మ, సిఐటియు పట్టణ నాయకులు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.










