ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కనీస వేతనాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని భగం చేసేందుకు పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగించారు. ఏళ్ల తరబడి అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యాన ఈనెల 25న చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈనేపథ్యంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి ఎవరూ వెళ్లకుండా ఆదివారం ఉదయం నుంచి యూనియన్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. మరికొందరిని స్టేషన్‌కు తరలించారు. జిల్లా కేంద్రంలో శ్రామిక మహిళాసంఘం నాయకులు బి.సుధారాణి ఇంటికి వెళ్లి అరెస్టు చేసి ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజును, గంట్యాడలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనసూయను తమ ఇళ్ల వద్ద అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించారు.

బొబ్బిలి : పట్టణ ప్రాజెక్టు నాయకులు జె.కామేశ్వరి, ఎ.రోజాను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరితే సమస్యలు పరిష్కరించకుండా అరెస్టు చేయడం దుర్మార్గమని ఈ సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జామి : మండల నాయకురాలు వెంకటలక్ష్మిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యకర్తలందరినీ చలో విజయవాడకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. వేపాడలో యూనియన్ నాయకులు కె.లక్ష్మిని వల్లంపూడి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వీరి అరెస్టును సిఐటియు నాయకులు మద్దిల రమణ ఖండించారు.
రాజాం : ఐసిడిఎస్ ప్రాజెక్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బి.ఉమాకుమారి, ఎల్.జయలక్ష్మి, నాయకులు లక్ష్మీనారాయణ, రాంబా యి, పార్వతి మంగమ్మ, వరలక్ష్మి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి అరెస్టులను సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి ఖండించారు.
గజపతినగరం : అంగన్వాడీ యూనియన్ గజపతినగరం ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎం సుభాషినిని పోలీసులు అరెస్టు చేశారు. చలో విజయవాడకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తమ ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఆమెను అరెస్టును సిఐటియు జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి, సిపిఎం నాయకులు జి.శ్రీనివాస్ ఖండించారు.

స్టేషన్‌లో ఉంచిన వన్‌టౌన్ పోలీసులు
అంగన్వాడీల అరెస్టులు దుర్మార్గం : సిఐటియు
సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని భగం చేసేందుకు పోలీసులు అంగన్వాడీ నాయకులను, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేయడాన్ని సిఐటియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈమేరకు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.శంకర్రావు, కె.సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 25న విజయవాడ ధర్నాచౌక వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తామని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ దరఖాస్తు చేసినా అనుమతి లేదని నాయకుల ఇళ్లకు వెళ్లి భయబ్రాంతులకు గురి చేసి స్టేషన్లకు తరలించడం ప్రభుత్వ దుర్మార్గపు చర్యని పేర్కొన్నారు. వెంటనే నాయకులను, అంగన్‌వాడీ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు చివరి అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా అయినా పరిష్కరించాలని కోరితే నిర్బంధం ప్రయోగించడం సరికాదని తెలిపారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం,పెన్షన్, పిఎఫ్,ఇఎస్‌ఐ, గ్రాట్యూటీ అమలు చెయ్యాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎంతటి నిర్బంధాన్ని ప్రయోగించినా ఉధృతపోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.










