
ప్రజాశక్తి - భీమవరం
సమాజంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. ఈ హక్కును నేటి ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. సమస్యపై గొంతెత్తితే ఆ గొంతును నొక్కడం, పోలీసులను ప్రయోగించి నిర్బంధించడం, అరెస్టులకు పాల్పడడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. ఇదేమని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి కటకటాల వెనక్కి నెట్టుతున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను తుంగలోకి తొక్కి రాజ్యాంగాన్ని పరిహాసం చేయడంతోపాటు హక్కులను హరించి వేస్తున్నారని వామపక్షాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
అంగన్‌వాడీలు అనేక ఏళ్ల నుంచి దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యలపై అనేక ఆందోళనలు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో సమస్యల పరిష్కారం లభించలేదు. దీనికితోడు అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు సైతం ఏ ఒక్కటీ అమలు కాలేదు. ఈ సమస్యలపై జిల్లాలో అనేకసార్లు అంగన్‌వాడీలు దశలవారీ పోరాటాలు కూడా చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఈ నేపథ్యంలో ఐసిడిఎస్ పరిరక్షణ కోసం, అంగన్‌వాడీలకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పెన్షన్, పిఎఫ్, ఇఎస్‌ఐ, గ్రాట్యూటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ఈనెల 25న తేదీన మహాధర్నా చేయాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంగన్‌వాడీలపై నిర్బంధాన్ని విధించింది. యూనియన్ నాయకులు, అంగన్‌వాడీల ఆచూకీ కోసం జల్లెడ పట్టారు. జిల్లా అంతటా వీరి కదలికలపై నిఘా పెట్టారు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారని ఆరా తీశారు. విజయవాడ ధర్నాకు వెళ్లకుండా అడ్డంకులు సృష్టించింది. సిఐటియు నేతలు, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు, చివరకు అంగన్‌వాడీ టీచర్లకు సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొంతమందిని గృహ నిర్బంధం చేశారు. భీమవరంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి గోపాలన్, తణుకులో సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రతాప్, ఆకివీడులో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్ఫర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కళ్యాణికి ఇంటి వద్ద పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలాగే పాలకొల్లు అర్బన్, తాడేపల్లిగూడెం పట్టణం, అర్బన్, ఆకివీడు పట్టణాలతోపాటు జిల్లాలో 300 మంది అంగన్‌వాడీి టీచర్లకు నోటీసులు జారీ చేశారు. విజయవాడ ధర్నాకు వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆందోళనకు పిలుపు ఇచ్చిన ప్రతిసారీ అక్రమ నిర్బంధాలకు పాల్పడడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అంగన్‌వాడీలకు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతానన్న ముఖ్యమంత్రి హామీ నీటిమీద రాతగా మిగిలిపోయింది. రకరకాల యాప్‌లు తెచ్చి అంగన్‌వాడీలకు పనిభారం పెంచారు. కొత్తగా గర్భిణులు, బాలింతలకు ఫేస్ యాప్ తీసుకొచ్చారు. ఫోన్లు పనిచేయకపోయినా, నెట్ సిగల్ లేకపోయినా అమలు చేయాలని అధికారులు అంగన్‌వాడీలను మానసిక వేధింపులకు గురిచేస్తున్నారు. ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా సెంటర్లు కుదించడానికి నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చి సెంటర్లను మెర్జ్ చేస్తున్నారు. లబ్ధిదారులను కుదించడానికి పోషణ ట్రాక్‌యాప్‌ను తీసుకొచ్చింది. ప్రయివేటీకరణ విధానంలో భాగంగా రకరకాల యాప్‌లు తెచ్చి పనిభారం పెంచారు. ప్రభుత్వ విధానాల వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు అనేక రెట్లు పెరిగాయి. అయితే వేతనాలు పెరగలేదు. అంగన్‌వాడీలకు గ్రాడ్యూటీ అమలు కావడం లేదు. సెంటర్ల అద్దెలు, టిఎ బిల్లు, వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ బిల్స్ నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలను అవమానించే విధంగా కేంద్రాలను పర్యవేక్షణ పేరుతో ఫుడ్ కమిషనర్, ఎంఎస్‌కె, ఎంఆర్‌ఒ, ఎండిఒ, రాజకీయ నాయకులు ఇలా అనేక మంది విజిట్ల పేరుతో అవమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. అనేక సమస్యల మధ్య వారు సతమతమవుతున్నారు. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన అంగన్‌వాడీలు ఆ విధంగా అడుగులు వేస్తుంటే ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని విధిస్తోంది.
తణుకు రూరల్: పాదయాత్రలో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్ డిమాండ్ చేశారు. శనివారం అర్ధరాత్రి సిఐటియు నాయకులకు, అంగన్‌వాడీలకు నోటీసులిచ్చి 25న చలో విజయవాడను అడ్డుకోవడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయమంటే నియంతృత్వంగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న వారిని నిర్బంధం, అరెస్టులు, నోటీసులు వంటి వాటితో అడ్డుకోవడం నియంతృత్వ చర్యలేనని విమర్శించారు. విజయవాడ వెళ్లేవారిని ఆపడం మానుకొని వారి సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. ఈ చర్యలు మానుకోకపోతే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.