Sep 25,2023 23:12

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, యంత్రాంగం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద శాంతియుతంగా ఆందోళన చేయడానికి వెళుతున్న అంగన్‌వాడీలను పోలీసు లు సోమవారం ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేశారు. విజయవాడ వెళ్ళనీయకుండా జిల్లావ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో నిర్బంధించి వివిధ స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టులను నిరసిస్తూ సోమవారం కాకినాడ సుందరయ్య భవన్‌ వద్దకు చేరుకున్న పలువురు అంగన్‌వాడీ వర్కర్లు, సిఐటియు నాయకులపై పోలీసులు జులం ప్రదర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తూ కలెక్టరేట్‌ వద్దకు ర్యాలీగా వెళుతున్న వారిని అక్రమంగా అరెస్టు చేశారు. మహిళా పోలీసులు లేకుండా మగ పోలీసులే అంగన్‌వాడీలను అడ్డుకుని అతి ప్రదర్శించారు. సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజ్‌కుమార్‌, కోశాధికారి మలకా రమణను బలవంతంగా ఈడ్చుకుని వెళ్లి జీపుల్లో ఎక్కించి 2 టౌన్‌, 3 టౌన్‌ స్టేషన్లకు తరలించారు. అనంతరం కలక్టరేట్‌ వద్దకు ప్రదర్శనగా వెళుతున్న మహిళలను పోలీసులు అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారు. బారికేడ్లు అడ్డుపెట్టి బలవంతంగా అడ్డుకున్నారు. కలక్టరేట్‌ వద్ద ధర్నాకు ఎటువంటి అనుమతి లేదని హెచ్చరించారు. సిఐటియు నాయకులను తక్షణమే విడుదల చేయాలని అంగన్‌వాడీలు జిల్లా పరిషత్‌ సెంటర్లో సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
సిఐటియు నాయకులు మీడియాతో మాట్లాడుతూ సిఎం వైఎస్‌.జగన్‌ ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన నిరసన తెలియజేసే హక్కుని కాలరాస్తుందని విమర్శించారు. ప్రజా ఉద్యమాల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ చట్టాన్ని సైతం దిక్కరించి పోలీస్‌ యంత్రాంగం మహిళలు అని కూడా చూడకుండా రాత్రి 8 గంటల వరకు సామర్లకోట పోలీస్‌ స్టేషన్లో నిర్బంధించడాన్ని తప్పు పట్టారు. టికెట్లు కొనుగోలు చేసి విజయవాడ ప్రయాణిస్తున్న వారిని ఎక్కడికక్కడ నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధమని దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రతిపక్షంలో కూర్చోవడానికి జగన్మోహన్‌ రెడ్డి సిద్ధపడాలని హెచ్చరించారు. నిత్యావసర సరుకుల ధరలు, కరెంటు ఛార్జీలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు పెంచుతున్న జగన్‌ ప్రభుత్వానికి ఉద్యోగుల జీతాలు పెంచాలని తెలియాదా అని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా సిఐటియు జిల్లా, స్థానిక నాయకత్వాన్ని, అంగన్వాడీ ప్రాజెక్టు నాయకులను గృహ నిర్బంధాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. అయినా అంగన్వాడీలందరూ ముందు రోజు నుంచే జిల్లా నుంచి వందల సంఖ్యలో విజయవాడకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం.వెంకట రమణ, అన్నపూర్ణ, జి.అమ్మ, కె.వీరవేణి, సుహాసిని, ఈశ్వరమ్మ, గంగా భవానీ పాల్గొన్నారు.
తుని : అంగన్‌వాడీలను అక్రమ అరెస్టుకు నిరసనగా సిఐటియు మండల కార్యదర్శి నక్కల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయం నుంచి గొల్ల అప్పారావు సెంటర్‌ వరకూ మానవహారం నిర్వహించారు. సిఐటియు నాయకులు ఎస్‌కె.పద్మ, కామేశ్వరి, సత్యకళ, ఇందిర, పద్మ, శాంత కుమారి, ఉమామహేశ్వరి, సత్యవేణి పాల్గొన్నారు.
ప్రత్తిపాడులో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రొంగల ఈశ్వరరావు, నెట్ల శ్రీను, పాకలపాటి సోమరాజు, పివి.లక్ష్మి, ఎం.సత్యవతి, సిహెచ్‌.ఆశారత్నం, ఆదిలక్ష్మి, బి.వరదివ్య, కృపావతి, డి.నాగవేణమ్మ, ఇ.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.