Sep 26,2023 21:09

అంగన్వాడీలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

 వేంపల్లె : అంగన్వాడీలపై అక్రమంగా పోలీసులు పెట్టిన కేసులను ప్రభుత్వం ఎత్తి వేయాలని అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్షురాలు సరస్వతి డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించుకొనేందుకు తలపెట్టిన చలో విజయవాడను అడ్డుకోవడం శోచనీయమన్నారు. శాంతియుతంగా జరిగే ఉద్యమాలపై కూడా నిర్భంధాలు పెట్టి అంగన్వాడీలపై కేసులు బనాయించడం మంచి పద్ధతి కాదన్నారు. మినీ అంగన్వాడీలను మెయిన్‌ అంగన్వాడీలుగా గుర్తించాలని కోరారు. ధర్నా కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకురాలు శైలజ, ధనలక్ష్మి, హసీనా, నాగేశ్వరి పాల్గొన్నారు.
కమలాపురం : న్యాయమైన సమస్యలపై అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ వర్కర్లు రాష్ట్రంలో లక్ష మందికి పైగా జరుపుతున్న పోరాటంపై పోలీసు జులుం ప్రదర్శించడాన్ని అఖిలపక్ష ట్రేడ్‌ యూనియన్లు తీవ్రంగా ఖండిస్తున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కామనురు శ్రీనివాసులురెడ్డి అన్నారు. అంగన్వాడీ వర్కర్స్‌పై పోలీసులను ఉపయోగించి జరిపిన నిర్బంధానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఊరేగింపులు, ర్యాలీలు, ధర్నాలు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేయాలని అఖిలపక్ష ట్రేడ్‌ యూనియన్లు పిలుపునిచ్చాయన్నారు. నిర్బంధానికి నిరసనగా రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపులో భాగంగా మంగళవారం కమలాపురంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు రాణి, జ్యోతి, యశోద, భవానీ, కుష్మావతి, భారతి, ఉషారాణి, ఉమాకాంతమ్మ, రామప్రభ, మయూరి, ప్రభావతి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సి.సుబ్బారాయుడు పాల్గొన్నారు.
జమ్మలమడుగు : రాష్ట్రవ్యాప్తంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడ వెళ్లిన అంగన్వాడీలను నిర్బంధించడం, అరెస్టు చేయడం అన్యాయమని సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు జి.ఏసుదాసు, దాసరి విజరు ఖండించారు. స్థానిక ఎన్‌జిఒ హోం కార్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పోలీసుల ద్వారా అంగన్వాడీ వర్కర్లకు నోటీసులు ఇచ్చి, బెదిరించి, అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సిఐటియు ఆటో స్టాండ్‌ కార్యదర్శి నరేంద్ర పాల్గొన్నారు. వేంపల్లె : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీలు