ప్రొద్దుటూరు : తమ సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీలు ఈ నెల 25న విజయవాడలో నిర్వహించతలపెట్టిన ధర్నాను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్బంధానికి దిగింది. ఇందులో భాగంగా ప్రొద్దుటూరులో అంగన్వాడీ యూనియన్ నాయకులు ఉప్పలపాటి ఉషారాణికి జమ్మలమడుగులో మండల అధ్యక్షులు లక్ష్మీదవేవి, కార్యదర్శి భాగ్యలక్ష్మి పోలీసులు మందుస్తుగా నోటీసులు అందజేశారు 25న అంగన్‌వాడీ కేంద్రాలను తెరిచి ఉండాలని, విజయవాడ దీక్షలకు వెళ్లినా, ఇతర కారణాలతో గైర్హాజరైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆ నోటీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేతనం పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు ఇవ్వాలని, పెన్షన్ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యాన అంగన్‌వాడీలు పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అన్ని జిల్లాల్లోనూ చలో కలెక్టరేట్ నిర్వహించామని అయినా,ః ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో విజయవాడలో ధర్నాచేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీనిని అడ్డుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తల ఇళ్లకు పోలీసులు వెళ్లి నోటీసులు ఇవ్వడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడి న్యాయమైన కోరికలు తీర్చాలని కోరారు.
అంగన్వాడీల అరెస్టు ఖండిస్తున్నాం : సిపిఎం
కడప అర్బన్ : అంగన్‌వాడీలు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దష్టికి తీసుకురావడానికి 25న తలపెట్టిన ధర్నాను విఫలంచేయడానికి ప్రభుత్వ, పోలీసు నిర్బంధాన్ని, అరెస్టులను ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా జరిగే ధర్నాలో హింస జరుగు తుందనే తప్పుడు ప్రచారం పోలీసులు చేయడం గర్హనీయం. ఎక్కడికక్కడ ఇళ్ళవద్దనే అరెస్టులు చేసి నిర్బంధించడం, వాహనాలను అడ్డుకోవడం, ధర్నాకు అనుమతినివ్వకపోవడం అప్రజాస్వామికమని తెలిపారు. అంగన్‌వాడీ కార్మికులు తమ సమస్యలకోసం గత కొంతకాలంగా వివిధ రూపాలలో ఆందోళన చేస్తున్నారు. తమ న్యాయసమ్మతమైన కోర్కెలను ప్రభుత్వం దష్టికి తీసుకురావడం, నిరసన తెలపడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని హరించడమే.










