కడప అర్బన్ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం విజయవాడకు వెళ్లిన అంగన్వాడీలపై నిర్బంధం, అరెస్టు చేయడం తగదని సిఐటియు , ఎఐటియుసి నాయకులు అన్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శలు బి. మనోహర్, నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ సిఎం పోలీసుల ద్వారా అంగన్వాడీ వర్కర్లకు నోటీసులు ఇచ్చి, బెదిరించి, అరెస్టు చేయడం దుర్మార్గమని తెలిపారు. అధికారం రాకముందు ఒక మాట, వచ్చిన తరువాత మరో మాట మాట్లాడడం దారుణమని పేర్కొన్నారు. తెలంగాణ కంటే ఒకవేయి ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రస్తుతం అంగన్వాడీలకు రూ. 2వేలు తక్కువ ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేస్తున్న వారిని దుర్మార్గంగా అరెస్టు చేయడం ఘోరమని చెప్పారు. అంగన్వాడీలకు పనికి తగ్గ సమాన వేతనం ఇచ్చి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. యాప్‌ల పేరుతో పనిభారానికి గురి చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యల తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. నిరసనలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాసులు రెడ్డి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, ఏఐటియు సి డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బాదుల్లా, ఉదరు, పవన్, పద్మా దీప, సునీత యశోద, శాంతి వెంగామాంబా, సుకుమారి, లక్ష్మీదేవి, జిల్లా వ్యాప్తంగా అంగన్వాడి వర్కర్స్, లీడర్స్, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రొద్దుటూరు(పుట్టపర్తి సర్కిల్) : అంగన్వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సుబ్బలక్ష్మి, సునీత, నాగలక్ష్మి, రాజీ, సువార్తమ్మ, నాగవేణి, నాగేశ్వరి, రామసుబ్బమ్మ అంగన్వాడీ వర్కర్లు ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










