
అంగన్వాడీల చలో విజయవాడపై ప్రభుత్వ, పోలీసు నిర్బంధకాండను ఖండిస్తూ విశాఖ, అనకాపల్లి జిల్లా కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన అంగన్‌వాడీలు సోమవారం భారీ ఆందోళనలకు దిగారు. విశాఖలో 200 మందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పోలీసులు ఎంత నిర్బంధం ప్రయోగించినా అనకాపల్లి పట్టణంలో వందలాది మంది అంగన్‌వాడీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఐసిడిఎస్ పీడీ కార్యాలయాన్ని ముట్టడించి నినాదాలతో హోరెత్తించారు. డిమాండ్లను నెరవేర్చే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.
విశాఖ కలెక్టరేట్ : సోమవారం ఉదయానికే వందలాది మంది అంగన్‌వాడీలు విశాఖ ఆర్‌టిసి కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. లలిత జ్యూయలరీ ఎదుట రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల చలో విజయవాడ కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని పోలీసులను నిలదీశారు. దీంతో పోలీసులు అక్కడ ఉన్న అంగన్‌వాడీలను, వారికి నాయకత్వం వహిస్తున్న వారిని అరెస్టు చేశారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన వారినీ అరెస్టు చేసి పోలీసు బ్యారెక్స్ వద్దకు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పి.మణి, సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్, యూనియన్ గౌరవ సలహాదారు కె.బృందావతి, జిల్లా అధ్యక్షురాలు బి.తులసి, కార్యదర్శి ఎల్.దేవి, కోశాధికారి కె.పద్మావతి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.శోభారాణి ఉన్నారు. అక్రమ అరెస్టులను సిఐటియు జిల్లా నాయకులు కుమార్, మణి ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీలకు ఇచ్చిన హమీలను అమలు (మొదటి పేజీ తరువాయి..) చేయాల్సిందేనన్నారు. కనీస వేతనం ఇచ్చి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పని భారం తగ్గించాలన్నారు. అరెస్టయిన వారిని సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి.కృష్ణారావు పరామర్శించారు. అంగన్‌వాడీల పోరాటానికి మద్దతు తెలిపారు.
అనకాపల్లి : సిఐటియు కార్యాలయం నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్ మీదుగా అంగన్‌వాడీలు భారీ ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ చౌక్ సెంటర్‌లో మానవహారం చేపట్టారు. అనంతరం ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.శంకర్‌రావు, ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మజ్జి నాగశేషు మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాడ్యుటీ, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఆన్‌లైన్ పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలన్నారు. బిల్లులపై ట్రెజరీ కమీషన్లు తీసుకోవడం ఆపాలన్నారు. చిన్నచిన్న కారణాలతో జీతం కోతలు ఆపాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పీడీ అనంతలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.దుర్గారాణి, కోశాధికారి వివి.రమణమ్మ, నాయకులు కాసులమ్మ, జయ, వెంకటలక్ష్మి, సిఐటియు జిల్లా కోశాధికారి వివి.శ్రీనివాసరావు ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మాణిక్యం, వరలక్ష్మి, డి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. అక్రమ అరెస్టులను ఎఐటియుసి నాయకులు కోన లక్ష్మణ ఖండించారు.
చోడవరం : చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకోవడంలో భాగంగా సిఐటియు జిల్లా నాయకులు జి.వరలక్ష్మిని సోమవారం చోడవరం పోలీసులు గృహ నిర్బంధం చేశారు.