Jun 15,2023 20:36

సిడిపిఒ కార్యాలయం ధర్నా చేస్తున్న అంగన్వాడీలు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
అంగన్వాడీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.అంజిబాబు, తాలూకా కార్యదర్శి బి.రాముడు డిమాండ్‌ చేశారు. గురువారం ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిడిపిఒ కార్యాలయంలో ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంగన్వాడీ కార్మికులకు గ్రాట్యుటీ, పింఛను, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ నాయకుల వేధింపులు పెరగడం వల్ల అంగన్వాడీ కార్యకర్తలు అకస్మాత్తుగా చనిపోతున్నారని వాపోయారు. బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని, నాణ్యమైన సెల్‌ ఫోన్లు ఇవ్వాలని సీనియర్‌ అధికారికి వినతిపత్రం అందజేశారు. నాయకులు బి.గోవర్ధనమ్మ, బి.పద్మ, ఎస్‌.నాగలక్ష్మి, సెక్టార్‌ కార్యకర్తలు కె.నాగేశ్వరమ్మ, ప్రభావతి, మేరీ, అక్తర్‌, తులసీ, శైలజ, మల్లేశ్వరి, నాగమణి, లక్ష్మి, ప్రమీలమ్మ, పుష్పావతి, రామలింగమ్మ, గౌషియాబేగం, సరోజ, భాగ్యమ్మ, సిఐటియు నాయకులు రాజు పాల్గొన్నారు. ఆలూరులో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీల కోర్కెల దినం సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ నాయకులు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు ముందు ధర్నా నిర్వహించారు. సిడిపిఒ లలితకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కెపి.నారాయణ స్వామి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచి గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు ఇచ్చి, అందులో సగం వేతనంతో పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభావతి, జయశ్రీ, సిఐటియు నాయకులు వెంకటేశులు, మైనా పాల్గొన్నారు.