Jun 10,2023 21:23

అంగన్వాడి సేవలు వివరిస్తున్న అంగన్వాడి టీచర్‌ మంజుల

అంగన్‌వాడీల్లోనే పిల్లల జీవితాల్లో మార్పులు
ఐసిడిఎస్‌ సూపర్‌ వైజర్‌ విజయకుమారి
ప్రజాశక్తి - ఆత్మకూర్‌
ఆరు సంవత్సరాల లోపు పిల్లల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేది అంగన్వాడీ కేంద్రాలేనని ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ విజయ కుమారి, అంగన్వాడీ వర్కర్‌ మంజుల అన్నారు. శనివారం మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో జన బాగిదార్‌ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల తల్లులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు సంవత్సరాల వయసు గల పిల్లలు తల్లి ఒడికి, ఇంటికి పరిమితం అవుతారని అన్నారు. ఆరు సంవత్సరాల వయసు అత్యంత విలువైన సమయమని, బయట ప్రపంచం పట్ల వారు ఆకర్షితులు అవుతారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు ఆట, పాట, కథల రూపంలో విద్యా బోధన చేయడంతో పాటు బాల్య దశలో వారికి వ్యక్తిత్వ వికాసం గూర్చి అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. పిల్లలకి అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడంతోపాటు విద్యా బోధనలు అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్నట్లు తలిపారు. ఈ కార్యక్రమాలకు గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, తల్లులు సహకరించి విద్యార్థులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చాలని కోరారు.