Aug 17,2023 21:18

ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇస్తున్న సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు

అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి
- సిఐటియు, అంగన్‌వాడీ యూనియన్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

    అంగన్వాడీలకు తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ అమలు చెయ్యాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎం.నిర్మల, నాయకురాలు అర్బన్‌ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు నాగరాణి, సునీతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారు ఎమ్మెల్యే రవి చంద్ర కిషోర్‌ రెడ్డిని కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కాలంలో ప్రభుత్వ విధానాల వల్ల పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యవసర వస్తువుల ధరలు అనేక రెట్లు పెరిగాయని, కానీ అందుకు అనుగుణంగా వేతనాలు పెంచలేదన్నారు. తెలంగాణాలో 2021 జూలై నుండి వర్కర్లకు రూ.13,650లు, హెల్పర్‌, మినీ వర్కర్లకు రూ.7,800 ఇస్తున్నారని, మన రాష్ట్రంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదని, సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడంలేదన్నారు. సెంటర్ల నిర్వహణకు అంగన్వాడీలు పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 2017 నుండి టిఎ బిల్లులు ఇవ్వడం లేదని చెప్పారు. 2022 ఏప్రిల్‌ 25 అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాట్యూటీ అమలు చెయ్యమని చెప్పిన తీర్పు ఇంత వరకు అమలు చేయలేదన్నారు. రకరకాల యాప్‌లు తెచ్చి పని భారం పెంచారన్నారు. అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షణ పేరుతో అధికారులు, రాజకీయ నాయకులు విజిట్ల పేరుతో అంగన్వాడీలను అవమానిస్తూ, వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రాజెక్టులోని హనుమాయమ్మను రాజకీయ కక్షలతో నిర్ధాక్షిణ్యంగా చంపారని, కనీసం మట్టి ఖర్చులు ఇచ్చే దిక్కు కూడా లేదన్నారు. ఈ నేపధ్యంలో అంగన్వాడీల సమస్యలు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చర్చించి పరిష్కారం చెయ్యాలని కోరారు.