
సుప్రీంకోర్టు తీర్పును గుజరాత్ ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అలా అమలు చేయకపోతే మరలా పోరాడి దాన్ని అమలు చేయించుకోవాలి. లేదా కోర్టు ధిక్కరణ కింద కేసు వేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా దేశంలోని అంగన్‌వాడీలందరూ ఈ తీర్పు అమలు చేయాలని కోరుతూ కోర్టు లోనూ, కోర్టు బయటా పోరాడాలి. గౌరవ వేతనం పేరుతో స్కీమ్ వర్కర్లను దోపిడీ చేయడాన్ని అనుమతించరాదు. స్కీమ్ వర్కర్లందరూ ఐక్యమై తమను వర్కర్లుగా గుర్తించి కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ సదుపాయాలు, ఇతర పని పరిస్థితుల అమలు కోసం సుదీర్ఘ పోరాటాలకు సిద్ధం కావాలి.
ఏప్రిల్ 25న అంగన్‌వాడీలు ఉద్యోగ విరమణ సదుపాయమైన గ్రాట్యుటీకి అర్హులని, దాన్ని వడ్డీతో సహా చెల్లించాలని గుజరాత్ రాష్ట్రానికి ఆదేశాలిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది, స్వాగతింపదగినది. ఈ తీర్పు స్కీమ్ వర్కర్లందరికీ మంచి తీపి కబురు. 43 నుండి 45వ భారత కార్మిక మహాసభలు స్కీమ్ వర్కర్లను వర్కర్లుగా గుర్తించి వారికి కనీస వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలన్న సిఫార్సులను మోడీ ప్రభుత్వం అమలు చేయడానికి నిరాకరించింది. ఈ తీర్పు మోడీ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది.
గుజరాత్ లో రిటైర్ అయిన ఐదుగురు అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు తమకు ఉద్యోగ విరమణ సదుపాయమైన గ్రాట్యుటీ వర్తింపజేయాలని ఆ చట్టం కింద ఉన్న అధికారికి పిటిషన్ పెట్టారు. వారు దానికి అర్హులని, దాన్ని చెల్లించాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి కంట్రోలింగ్ అధారిటీ ఆదేశాలు జారీ చేశారు. కానీ ప్రభుత్వం ఈ ఆదేశాలపై అప్పీలుకు వెళ్ళింది. అప్పిలేట్ అధారిటీ కూడా గ్రాట్యుటీ చెల్లించాలన్నది. ఈ నిర్ణయాన్ని గుజరాత్ హైకోర్టు సింగిల్ జడ్జి కూడా ధృవీకరిస్తూ తీర్పు చెప్పారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అప్పటికి కూడా ఆగకుండా ఈ తీర్పుకు వ్యతిరేకంగా గుజరాత్ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసింది. అంగన్‌వాడీ వర్కర్లు - రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య యజమాని ఉద్యోగి సంబంధం లేదని... కావున వారు రాష్ట్ర ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేయడానికి అర్హులు కారన్న పాత తీర్పును తిరగదోడిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టి వేసింది. దీంతో అంగన్‌వాడీ ఉద్యోగులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అంతిమంగా ఏప్రిల్ 25న సుప్రీంకోర్టు అంగన్‌వాడీ ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ముఖ్యాంశాలు ా గ్రాట్యుటీ చట్టం లోని ''వేతనాలు'' నిర్వచనం చాలా విశాల ప్రాతిపదికలో ఉన్నదని, డ్యూటీలో ఉన్న ఉద్యోగికి వచ్చే ప్రతిఫలం వేతనం కిందకు వస్తుందని చెప్పింది. అందువల్ల అంగన్‌వాడీ వర్కర్లకు, హెల్పర్లకు చెల్లించే గౌరవ వేతనం కూడా వేతనం నిర్వచనం కిందే వస్తుందన్నది. కావున వేతనాలు పొందుతున్న అంగన్‌వాడీలు గ్రాట్యుటీకి అర్హులని చెప్పింది. గ్రాట్యుటీ చట్టంలోని సెక్షన్ 1 (3) (సి) ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం 1997 ఏప్రిల్ 3న విద్యాసంస్థలను ఎస్టాబ్లిష్‌మెంట్లుగా పేర్కొంటూ ఉత్వర్వులిచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ప్రీ స్కూల్ నిర్వహిస్తున్నారు కాబట్టి అది పూర్తిగా విద్యా కార్యక్రమమేనని చెప్పింది. బోధన కార్యక్రమాన్ని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు నిర్వహిస్తున్నారన్నది. అంగన్‌వాడీ సెంటర్లు గ్రాట్యుటీ చట్టంలోని ఎస్టాబ్లిష్‌మెంట్ నిర్వచనం కిందకు వస్తాయి కాబట్టి గ్రాట్యుటీ చెల్లించాలన్నది.
శిశువుల సంరక్షణకు, అభివృద్ధికి ఏర్పాటుచేసిన ఐసిడిఎస్ ప్రపంచంలోనే పెద్ద పథకమని, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో దీని కింద 15.8 కోట్ల మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలు లబ్ధి పొందుతున్నారని సుప్రీం కోర్టు పేర్కొంది. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు పోషకాహారలేమిపై పోరు సల్పడమేగాక, కోవిడ్-19 మహమ్మారి దాడి చేసినప్పుడు వారు ముందు పీఠిన నిలబడి కీలకమైన పాత్ర పోషించారన్నది. ఐసిడిఎస్ కు మహిళా వర్కర్లు వెన్నెముక వంటి వారని కూడా సుప్రీం తన తీర్పులో ప్రశంసించడం గమనార్హం. ఐసిడిఎస్ కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని...ఆరేళ్ల లోపు చిన్నారుల హక్కులను (ముఖ్యంగా పౌష్టికాహారం, ఆరోగ్యం, అభ్యసన హక్కులను)...గర్భిÛణీలు, బాలింతల హక్కులను కాపాడే స్కీమ్ అని పేర్కొంది.
'గ్రాట్యుటీ చట్టం-1972' వర్తించే ఎస్టాబ్లిష్‌మెంట్ల (సంస్థల)లో వేతనాల ప్రాతిపదికన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గ్రాట్యుటీ చట్టంలోని సెక్షన్ 2 (ఎ) నిర్వచనం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే 'సంబంధిత ప్రభుత్వం' అవుతుంది. 1972 చట్టం నిర్వచనం ప్రకారం అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉద్యోగులే. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల మీద అజమాయిషీ మరియు నియంత్రణ కోసం నియమించబడిన వ్యక్తి లేదా అధికారి చట్టంలోని సెక్షన్ 2 (ఎఫ్) నిర్వచనం ప్రకారం యజమాని అవుతారు. ఉద్యోగి-యజమాని సంబంధాలు ఉన్నాయి కాబట్టి గ్రాట్యుటీకి అంగన్‌వాడీలు అర్హులవుతారని చెప్పింది.
2013లో వచ్చిన ఆహార భద్రతా చట్టం ఐసిడిఎస్ కింద ఏర్పడిన అంగన్‌వాడీ కేంద్రాలకు చట్టబద్దమైన హోదానిచ్చింది. 2013 చట్టంలోని సెక్షన్లు 4, 5, 6 కింద అంగన్‌వాడీ సెంటర్లు చట్టపర బాధ్యతను నిర్వహిస్తాయి. గుజరాత్ ప్రభుత్వం అంగన్‌వాడీల రిక్రూట్‌మెంట్ పద్ధతి, వారి విద్యార్హతలు, నియామక ప్రక్రియలతో కూడిన నియమాలను రూపొందించింది. ఈ నిబంధనల ప్రకారం అంగన్‌వాడీలు 58 సంవత్సరాల వయస్సు వరకు సర్వీసులో కొనసాగుతారు. అంగన్‌వాడీలను ఉద్యోగాల నుండి తొలగించే నిబంధనలు కూడా ఉన్నాయి. ఆ నిబంధనలలో అంగన్‌వాడీల సర్వీసును ''గౌరవ'' సర్వీసుగా పేర్కొనప్పటికీ ఆ ''గౌరవం'' అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు హోదాను నిర్ణయించజాలదని పేర్కొంది.
సుప్రీంకోర్టుకు వెళ్ళిన అంగన్‌వాడీ మహిళలు గుజరాత్‌లో 1982 ా 1985 మధ్య కాలంలో చేరి వర్కర్లుగా, హెల్పర్లుగా ఫిబ్రవరి 2006 నుండి ఫిబ్రవరి 2012 మధ్యలో రిటైర్ అయ్యారు. అప్పటి నుండి వారు తమకు గ్రాట్యుటీ వర్తింపజేయాలని పోరాడుతూ వచ్చారు. అంతిమంగా ఈ నెల 25న సుప్రీంకోర్టు వారికి గ్రాట్యుటీ చెల్లించాలని తీర్పు చెప్పింది. వారు ఉద్యోగ విరమణ పొందిన తేదీకి 3 నెలల తదుపరి నుండి గ్రాట్యుటీ చెల్లించే తేదీ వరకు 10 శాతం వడ్డీ కూడా చెల్లించాలన్నది. సుప్రీంకోర్టు దీనికే పరిమితం కాకుండా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు, పని పరిస్థితుల మెరుగుదల కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు తీర్పును గుజరాత్ ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అలా అమలు చేయకపోతే మరలా పోరాడి దాన్ని అమలు చేయించుకోవాలి. లేదా కోర్టు ధిక్కరణ కింద కేసు వేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా దేశంలోని అంగన్‌వాడీలందరూ ఈ తీర్పు అమలు చేయాలని కోరుతూ కోర్టు లోనూ, కోర్టు బయటా పోరాడాలి. గౌరవ వేతనం పేరుతో స్కీమ్ వర్కర్లను దోపిడీ చేయడాన్ని అనుమతించరాదు. స్కీమ్ వర్కర్లందరూ ఐక్యమై తమను వర్కర్లుగా గుర్తించి కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ సదుపాయాలు, ఇతర పని పరిస్థితుల అమలు కోసం సుదీర్ఘ పోరాటాలకు సిద్ధం కావాలి.
పి. అజయ కుమార్
/ వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు /