Jan 05,2023 23:38

ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు

సమస్యల పరిష్కారానికి అంగన్వాడీల నిరసన
ప్రజాశక్తి -ముంచింగిపుట్టు:
నెలసరి కనీస వేతనం రూ.26వేలు అమలు, ఉద్యోగ భద్రత కల్పన, ఇఎస్‌ఐ, పిఎఫ్‌, బీమాతోపాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పన, ఇతర సమస్యల పరిష్కారానికి స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీల ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన సిఐటియు మండల కార్యదర్శి కొర్ర శంకరరావు మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చిన సిఎం జగన్‌, ఇపుడు వాటిని అమలు చేయక మోసగించడం దుర్మార్గమన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. అధికారులు, రాజకీయ నేతల వేధింపులను అరికట్టడంతోపాటు పనిభారాన్ని తగ్గించాలని, ఆన్‌లైన్‌ అటెండెన్స్‌,ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ హాజరు నుంచి మినహాయించాలని కోరారు. గ్యాస్‌, కూరగాయల బిల్లులతోపాటు భవనం అద్దె, సకాలంలో చెల్లించాలని, ప్రస్తుత ధరలకు అనుగుణంగా బిల్లులు పెంచాలని కోరారు. దీనిపై స్పందించకుంటే మండల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లక్ష్మీపురం సర్పంచ్‌ కే త్రినాథ్‌, డొంబ్రు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.