ప్రజాశక్తి - ఆదోని
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు రూ.26 వేల వేతనమివ్వాలని, అంగన్వాడీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రం మాదిరిగా వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్.రాధాకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో పట్టణంలోని సిడిపిఒ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. జిల్లా కార్యదర్శి వెంకటమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనమివ్వాలని చట్టం చెబుతున్నా పాలకుల నిర్లక్ష్యం వల్ల అంగన్వాడీలు అవకాశాలను కోల్పోతున్నారని తెలిపారు. ఇంకెన్నాళ్లు వెట్టిచాకిరి అని, హక్కుల సాధన కోసం ఉమ్మడి పోరాటాలకు సన్నద్ధం కావాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న సెంటర్ అద్దెలు, కూరగాయల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్వహణ భారమైందని అధికారులకు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీతంలో సగం నెలనెల పింఛను విధానాన్ని అమలు చేయాలని కోరారు. సీనియారిటీ ప్రకారం సూపర్‌వైజర్లకు పదోన్నతి కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు సంక్షేమ పథకాలను అంగన్వాడీలకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మఒడి, ఇతరులకు ఇచ్చే సంక్షేమ పథకాలను వర్తింపజేయకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఆరోగ్యం బాగా లేని వారికి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, గోపాల్, మండల కార్యదర్శి వీరారెడ్డి, ప్రాజెక్ట్ అధ్యక్షులు వరలక్ష్మి, సరోజ, అంగన్వాడీ లక్ష్మి పాల్గొన్నారు.
ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న రాధాకృష్ణ










