ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా మహాసభలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.రోజా
ప్రజాశక్తి - ఏలూరు
పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా అంగన్వాడీల వేతనాలు తక్షణమే పెంచాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.రోజా డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో యూనియన్ 8వ జిల్లా మహాసభ జరిగింది. సభకు ఎమ్‌డి.హసీనాబేగం, పి.సుజాత, రాజేశ్వరి అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పి.రోజా మాట్లాడుతూ పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా అంగన్వాడీల వేతనాలు తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కనబరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలపై పర్యవేక్షణ పేరుతో వేధింపులకు పాల్పడటం అన్యాయమన్నారు. వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ పేరుతో అంగన్వాడీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ఛార్జీలకు సరిపడా ఇవ్వకుండా అంగన్వాడీలపై భారం మోపుతున్నారని విమర్శించారు. గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు రోజురోజుకీ తగ్గిస్తుందన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్ మాట్లాడుతూ అంగన్వాడీలకు బిల్లుల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు గ్రాట్యూటీ ఇవ్వాలని, ఐదు లక్షల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. చివరి వేతనంలో సగం పెన్షన్‌గా ఇవ్వాలని కోరారు. ఈ మహాసభలో యూనియన్ జిల్లా కార్యదర్శి పి.భారతి గత మూడేళ్ల కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. సభలో కె.విజయలక్ష్మి, పి.హైమావతి, పిఎల్‌ఎస్.కుమారి, బిజెఎన్.కుమారి, విమల, సరోజిని, మాణిక్యం, ఆదిలక్ష్మి, రాజకుమారి, భవాని, స్వప్న, రజనీ పాల్గొని మాట్లాడారు.










