నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు
అంగన్‌వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి
-25న ఛలో విజయవాడ
ప్రజాశక్తి-నెల్లూరు:రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్‌వాడీల సమస్యలను పరిష్కారిస్తామంటూ చేసిన హామీలను అమలు చేయాలని, ముఖ్యంగా అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25వ తేదిన ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిఐటియు నాయకులు జి.నాగేశ్వరరావు తెలిపారు. శనివారం నగరంలోని ఆర్‌డిఓ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీల అపరిషృత సమస్యలపై అసెంబ్లీలో చర్చలు నిర్వహించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ హెల్పర్స్ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్‌డిఓ కార్యాలయం ఎదుట శుక్రవారం అంగన్‌వాడీలు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో రెండవ రోజు అంగన్‌వాడీ హెల్పర్స్ నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు నాయకులు జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఇస్తున్న వేతనం కంటే అధనంగా వెయ్యి రూపాయలు వైసిపి ప్రభుత్వం ఇస్తుందని ఆర్భాటంగా ప్రకటన చేశారన్నారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డ ప్రతిపక్ష హౌదాలో ఉన్న సమయంలో అంగన్‌వాడీలకు చేసిన హామీలు నేడు విస్మరించడం సరికాదన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగున్న సంవత్సరం కాలం పూర్తియినప్పటికి చేసిన హామీలల్లో ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదన్నారు. రకరకాల యాప్‌ల పేరుతో అంగన్‌వాడీలపై పని వత్తిడి పెంచడమే కాకుండా రాజకీయ వేదింపులు ఎక్కువైపోయాయని, ముఖ్యంగా వాలంటీర్ల నుంచి సచివాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరు అంగన్‌వాడీలను బేదింరింపులకు గురిచేసేవారన్నారు. అంగన్‌వాడీలు రిటైర్మెంట్ అయిన తరువాత ప్రభుత్వం నుంచి ఎటువంటి బెనిఫిట్స్ లభించడం లేదన్నారు. రిటైర్మెంట్ అయిన అనంతరం ఆ సమయానికి తీసుకుంటున్న వేతనంలో సగం పెన్షన్‌గా అందజేయాలన్నారు. అంగన్‌వాడీల ఉద్యోగ వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంపుదల చేయాలని, కనీస వేతనంగా రూ.26 వేలు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఈ ప్రభుత్వానికి చివరివని, కనీసం ఈ సమావేశాల్లో అయినా అంగన్‌వాడీ సమస్యలపై చర్చలు నిర్వహించి పరిష్కార మార్గం చూపాలని ఆయన కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం 25వ తేదిన ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లక్షలాధి అంగన్‌వాడీ వర్కర్స్ , అంగన్‌వాడీ హెల్పర్స్‌తో ఏపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు, ఐఎఫ్‌టియుసి, ఏఐటియుసి వంటి అన్ని యూనియన్లను కలుపుకొని యావత్తు కార్మిక వర్గం ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలు వై.సుజాతమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల గురించి, ప్రజల గురించి అసెంబ్లీలో చర్చలు జరిపిన దాఖలాలు లేవని, ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం, కేసులు నమోదు చేసుకోవడం వంటి వాటితో సరిపెట్టుకుంటున్నారే తప్ప ప్రజల సమస్యలపై దృష్టి సారించిన పాపాన పోవడం లేదన్నారు. అసెంబ్లీ అంటే ఎంతో విలువలతో కూడిందని, అటువంటి సమావేశాలు నిర్వహించే సమయంలో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్లు అయినప్పటికి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకొనేందుకు ఎటువంటి చర్చలు జరగలేదన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల అనేక మంది అంగన్‌వాడీలు స్వచ్చందంగా తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారన్నారు. గడిచిన 40 సంవత్సరాల నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో తాము పనిచేసినప్పటికీ ఇప్పటి వరకు ఇటువంటి రాజకీయ వేదింపులు, మానసిక వత్తిడులకు తాము గురికాలేదన్నారు. ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్‌బీ, నగర కార్యదర్శి కె.పద్మా, అంగన్‌వాడీ కామాక్ష్మ, సంపూర్ణ, పలువురు అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్ప్‌ర్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు , అంగన్‌వాడీ హెల్పర్స్ పాల్గొన్నారు.










