* సిఐటియు జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు
ప్రజాశక్తి- కంచిలి: అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్.అమ్మన్నాయుడు, జిల్లా కార్యదర్శి సంగారు లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సోంపేట ప్రాజెక్టు మహాసభ కంచిలి మార్కెట్ యార్డులో ఆదివారం నిర్వహించారు. ఈ మహాసభలో వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో రూ.13,500 వేతనం ఇస్తున్నారని అన్నారు. అంగన్వాడీలకు నాలుగేళ్ల క్రితం రూ.వెయ్యి జీతం పెంచారని అన్నారు. అంగన్వాడీలకు కనీసం డిఎ కూడా అమలు చేయడం లేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలని అన్నారు. యాప్‌లు, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. గర్భిణులకు, బాలింతలకు టిహెచ్‌ఆర్ అమలకు కొత్తగా తీసుకొచ్చిన యాప్ వల్ల అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 7 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ అమలు చేయాలనే ఆలోచన విరమించు కోవాలన్నారు. రకరకాల యాప్‌లు తెచ్చి పనిభారం పెంచారని, పర్యవేక్షణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. 2017 నుంచి టిఎ బిల్లులు చెల్లించడంలేదని తెలిపారు. వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాసును ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఉద్యోగోన్నతి బెనిఫిట్ రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. అనంతరం సోంపేట ప్రాజెక్టు నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ సోంపేట ప్రాజెక్టు కమిటీ గౌరవ అధ్యక్షులుగా వెదుళ్ళ హేమలత, అధ్యక్షులుగా డి.మోహిని, ప్రధాన కార్యదర్శిగా ఎన్.హైమవతి, కమిటీ సభ్యులుగా జి.శాంతి, సుధ, విజయలక్ష్మి, ఆర్.మోహిని, ప్రమీలను ఎన్నుకున్నారు.










