ప్రజాశక్తి -గిద్దలూరు రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వచ్చే 8 నుంచి అంగన్‌వాడీలు సమ్మెబాట పట్టనున్నట్లు అంగన్‌వాడీ యూనియన్ నాయకురాలు డి. స్వర్ణ కుమారి తెలిపారు. సిడిపిఒ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ జాకీర్ హుస్సేన్‌కు మంగళవారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా స్వర్ణకుమారి మాట్లాడుతూ అంగన్‌వాడీలు అనేక సంవత్సరాల నుంచి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వాలు అంగన్‌వాడీల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. గత్యంతరం లేక అంగన్‌వాడీలు సమ్మె బాట పట్టాల్సి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్‌వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేయాలన్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు. మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీలపై యాప్‌ల భారం తగ్గించాలన్నారు. రాజకీయ వేధింపులు అరికట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ నాయకులు ఎ.మున్నా, విజయలక్ష్మి, కొండమ్మ, కష్ణవేణి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.