ప్రజాశక్తి- మదనపల్లె అర్బన్ :ఐసిడిఎస్ పరిరక్షణ కోసం, అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత,కనీస వేతనం, పెన్షన్, పిఎఫ్, ఇఎస్‌ఐ, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు డి.ఆర్.మధురవాణి, రాజేశ్వరి తెలిపారు. శనివారం మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు అనేక రెట్లు పెరిగాయన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని కోరారు. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలన్నారు.వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 ఏళ్లకు పెంచాలని, 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలిలన్నారు. వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీలు వాణి, విజయ, ప్రభావతి పాల్గొన్నారు.










