Oct 09,2023 23:15

కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తున్న సంఘాల నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : అంగన్‌వాడీలకు ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ రద్దు చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఎపి అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు), ఎఐటియుసి, ఐఎఫ్‌టియు అనుబంధ సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక మహిళా ప్రాంగణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ జానకితో ఆయా సంఘాల నాయకులు చర్చించారు. అంగన్వాడీ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, అధ్యక్షులు జి.బేబీరాణి, ఎఐటి యుసి నాయకులు, లలితమ్మ, ప్రేమ, ఐఎఫ్‌టియు నాయకులు జ్యోతిరాణి, భారతి పాల్గొని అంగన్‌వాడీల సమస్యలను కమిష నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ అంగన్వాడీలకు చాలా ఇబ్బందిగా ఉందని, సిగల్స్‌ ఉండట్లేదని ప్రీస్కూల్‌ సక్రమంగా జరగట్లేదని, లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని, పదేపదే సెంటర్‌ చుట్టూ తిరగాల్సి వస్తోందని, దీన్ని రద్దు చేయాలని కోరారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, తెలంగాణ కంటే రూ.వెయ్యి అదనంగా ఇస్తామన్న సిఎం హామీ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, పెన్షన్‌ ఇవ్వాలని, హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం నివారించాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌, అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన ఫీడింగ్‌ ఇవ్వాలని, మే నెల మొత్తం పాఠశాలల మాదిరిగా అంగన్‌వాడీ కేంద్రాలకూ వేసవి సెలవులు ఇవ్వాలని కోరారు. డ్యూటీలో ఉండి చనిపోయిన వారికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. రకరకాల యాప్‌లు రద్దు చేసి, ఒకే యాప్‌ ఉంచాలని, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా చేయాలని, 2017 నుండి పెండింగ్‌లో ఉన్న టిఎలు, ఇతర బిల్లులు, కరోనా కాలంలో 10 శాతం కట్‌ చేసిన వేతనం, ఛార్జి అలవెన్స్‌ ఇవ్వాలన్నారు. సూపర్వైజర్‌ పోస్టులు పెండింగ్‌లో ఉన్న సెకండ్‌ లిస్టు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు మీటింగ్‌లు వర్కర్లకు ప్రతినెలా, హెల్పర్లకు మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలన్నారు. రిటైర్మెంట్‌ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, యూనిఫామ్‌ తదితర సమస్యలను కమిషనర్‌కు వివరించారు. ఆయా సమస్యలపై కమిషనర్‌ సానుకూలంగా స్పందించారు. తన పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఎప్‌ఆర్‌ఎస్‌ యాప్‌లో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. ఒకే యాప్‌ విధానం, ఇతర తన పరిధిలో ఉన్న సమస్యలను ఈ నెలఖరులోగా పరిష్కరిస్తామని, జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారానికి జాయింట్‌ మీటింగ్‌లు నిర్వహించేలా పీడీలతో మాట్లాడతామని అన్నారు. వేతనాలు పెంపు, గ్రాట్యూటీ తదితర సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. చర్చల్లో వాణిశ్రీ, షకీలా, సుప్రజ, దీప్తి మనోజ, శ్రీదేవి, చంద్రావతి, అన్ని జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు.